నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం | shilpa mohanreddy joins in ysrcp | Sakshi
Sakshi News home page

నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం

Published Wed, Jun 14 2017 1:53 PM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం - Sakshi

నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం

- అధినేత ఎలా చెబితే అలా నడుచుకుంటా: శిల్పా మోహన్‌రెడ్డి
- కాన్ఫరెన్స్‌లు తప్ప మూడేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యం
- భారీ అనుచరగణంతో వైఎస్సార్‌సీపీలోకి చేరిన నంద్యాల నేత


హైదరాబాద్‌:
పదవులకు ఆశపడి కాదు.. ఆత్మగౌరవం కోసమే పార్టీ మారానని అన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి. భారీ సంఖ్యలో మద్దతుదారులు వెంటరాగా ఆయన బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శిల్పా, ఇతర కీలక నాయకులకు కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి స్వాగతం పలికారు. పార్టీలో చేరిక అనంతరం మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నంద్యాల సీటు విషయంలో అధినేత జగన్‌ ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారు.

చంద్రబాబు ధోరణితో విసిగిపోయాం: ‘‘వైఎస్సార్‌ సీపీలో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి అంతర్గత విబేధాలు హెచ్చుమీరాయి. ఆ కారణంగా నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఫిర్యాదుచేశా. ఒకటికాదు, వందలసార్లు మొరపెట్టుకున్నా. అయినాసరే, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల సమస్యలైనా తీర్చమని అడిగా ఫలితం లేదు. మాపట్ల టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యధోరణికి విసిగిపోయాం. ఫరూఖ్‌, అఖిలప్రియలు మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా చంద్రబాబు స్పందించలేదు. పర్సనల్‌ ఎజెండాలు లేకుండా పనిచేసే మనం ఇక పార్టీలో ఉండటం అనవసరమని క్యాడర్‌ అభిప్రాయపడింది. సమర్థవంతుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాం’’ అని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు.

చిన్నపిల్లల్ని మంత్రులు చేస్తే సహకరించాం
భూమా చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు తమను స్పంప్రదించారని, అప్పుడు తామేమీ అభ్యంతరం చెప్పలేదని శిల్పా మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘వయసులో మాకంటే చిన్నపిల్లలైన కొందరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంచికే అనుకున్నాం. కానీ వాళ్లు స్థానిక నేతలను అస్సలు పట్టించుకోలేదు. ఎంపీపీలు, జెడ్సీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు.. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఈ సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా సీఎం స్పందించలేద’’ని వివరించారు శిల్పా.

కాన్ఫరెన్స్‌లు తప్ప పని జరగట్లేదు
భూమా మరణం తర్వాత ఆయన కూతురు మంత్రి అయింది కానీ నంద్యాల సమస్యలు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఎంతోకొంత పని చేయాలనే ఉద్దేశంతో నంద్యాల టికెట్‌ సంగతేమిటని అడగ్గా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించారని శిల్పా వాపోయారు. రాష్ట్రస్థాయి నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం రాలేదని, ‘అమెరికా నుంచి తిరిగొచ్చాక చెబుతా’న్న బాబు మాట చివరికి నీటిమూటే అయిందని ఆవేదన చెందారు. టికెట్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడం కంటే అధిష్టానం నిర్లక్ష్యధోరణే తమను తీవ్రంగా బాధించిందని శిల్పా అన్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులు తప్ప పనులేవీ చేయలేదని విమర్శించారు. ‘ఎంతసేపూ పోలవరం, అమరావతి అంటారేగానీ రాయలసీమ సంగతి పట్టించుకోరా? పరిశ్రమలు స్థాపించామని ఘనంగా చెప్పుకుంటున్న మీరు వాటిలో ఎన్ని ప్రారంభమయ్యాయో చెప్పగలరా?’ అని చంద్రబాబును నిలదీశారు.

వైఎస్సార్‌ నా గురువు
దివంగత వైఎస్సార్‌ను గురువుగా అభివర్ణించిన శిల్పా మోహన్‌రెడ్డి.. ఆ మహానేత దయవల్లే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీలో చేరడం సొంతింటికి తిరిగొచ్చినట్లుందని అన్నారు. వైఎస్‌ కుటుంబానికి అండగా ఉండాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నంద్యాల టికెట్‌ విషయంలో జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డితో విబేధాలు లేవని, పార్టీలు వేరైనా కుటుంబ వ్యవహారాల్లో తేడాలు రావని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement