హైదరాబాద్‌కు బయల్దేరిన శిల్పా
– నేడు ఉదయం 10.30గంటలకు వైఎస్సార్సీపీలో చేరిక
నంద్యాల: మాజీ మంత్రి, టీడీపీ ఇన్‌చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఉదయం 10 గంటలకు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నంద్యాల మునిసిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతో కలిసి భారీ ఎత్తున శిల్పామోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంటి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. దాదాపు 150కి పైగా వాహనాల్లో నంద్యాల, గోస్పాడు నుంచి 2 వేల మంది కార్యకర్తలు వారి వెంట కదిలారు.
కార్యకర్తల్లో ఆనందోత్సవం
శిల్పా వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఆయన ఇంటి వద్ద బాణ సంచా పేల్చారు. ఇంటిపై ఉన్న టీడీపీ జెండాలను తొలగించి వైఎస్సార్సీపీ జెండాను కట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డు నుంచి వచ్చి శిల్పాకు పూలమాలలు వేసి అభినందించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, తామంతా అండగా ఉంటామని చెప్పారు.