
ఎందుకింత జాప్యం!
► ట్రిపుల్ ఐటీలో వారం కిందట జూనియర్లపై సీనియర్ల దాడి
► 22 మంది దాడి చేశారని ప్రకటించిన డైరెక్టర్
► పోలీసులకు ఫిర్యాదు చేయని వైనం..
► చర్యలు తీసుకోకుండా కమిటీ పేరుతో కాలయాపన
► ఆందోళన వ్యక్తంచేస్తున్న బాధిత విద్యార్థులు
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సీనియర్‌లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాడికి గురైన విద్యార్థుల్లో వేడి తగ్గే వరకు కాలయాపన చేసి, ఆ తర్వాత నామమాత్రపు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీ ఏర్పాటు, విచారణ పేరుతో సాగదీస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. వాస్తవానికి ఈ వ్యవహారంపై మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సీరియస్‌గా ఉన్నప్పటికీ... ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ మాత్రం వారం రోజులుగా చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీ ఏఓ రమాకాంత్, డీన్(స్టూడెంట్ వెల్ఫేర్) నాగార్జునదేవి సంఘటన జరిగిన రెండో రోజు దాడి జరిగిందని ప్రకటించారు.
జూనియర్లపై 20 నుంచి 30 మంది వరకు సీనియర్ విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు మాత్రం ఈ ఘటనలో 22మంది సీనియర్లు పాల్గొన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే, దాడి చేసిన విద్యార్థులను గుర్తించి మూడు రోజులు గడిచినా, ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో డైరెక్టర్ వ్యవహారంపై సిబ్బంది, విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అసలు దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటారా... తమకు న్యాయం జరుగుతుందా... అని బాధిత విద్యార్థులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో...!
ఈ ఘటనపై వివరాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు ఏఓ రమాకాంత్ నేతృత్వంలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలో అసిసెంట్ ప్రొఫెసర్లు, పోలీసు శాఖ కూడా నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఒకటో తేదీ నుంచి సమావేశమవడం, విద్యార్థులను విచారించడం మినహా ఇంత వరకు ఏం చర్యలు తీసుకోవాలని నిర్ణయించలేదు. కేవలం కాలయాపన చేసి ఈ వ్యవహారాన్ని మ మ.. అని ముగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగు రోజులుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తుండగా, మరోవైపు ఈ కమిటీలో సోమవారం మరో ముగ్గురిని నియమించినట్లు సమాచారం. ఈ ముగ్గురులో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్, నూజివీడుకు చెందిన ఓ న్యాయవాది, మరో ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాల ఏఓ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం బటయటకు రావడంతో ప్రయివేటు వ్యక్తులను కమిటీలో ఎలా నియమిస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
విచారణ చేసేది ఎవరు..?
ఈ గొడవపై విచారణ చేయాల్సింది పోలీసులా, కమిటీలో ఉన్న అధ్యాపకులా... అనేది స్పష్టత కొరవడింది. అధ్యాపకులు అడిగితే తాము దాడి చేసినట్లు సీనియర్ విద్యార్థులు అంగీకరిస్తారా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. గొడవ జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే, వారు విచారించి చర్యలు తీసుకునేవారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వ్యవహరించేవారు. ఈ విధంగా ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
జాప్యం చేయడంలేదు
విద్యార్థులపై చర్య తీసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. ఈ సంఘటనతో సంబంధం లేనివారిపై చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతోనే కమిటీ అన్ని విషయాలు సేకరిస్తూ విచారణ చేస్తోంది. రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయసలహా కోసం కమిటీలోకి న్యాయవాదిని తీసుకున్నాం. – ఆచార్య వీరంకి వెంకటదాసు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్