సర్వర్ డౌన్
సాక్షి, విజయవాడ : పెద్ద పండుగ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తున్న కానుకలు, నిత్యావసరాలు అందుకునేందుకు తెల్లకార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ-పోస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు రహిత సేవలను అమలుచేయాల్సి రావడంతో డీలర్లకు చుక్కలు కనపడుతున్నాయి.
మొరాయిస్తున్న సర్వర్
జిల్లాలోని 11.80 లక్షల మంది తెల్లకార్డుదారులు 2,161 రేషన్ షాపుల నుంచి నెలనెలా నిత్యావసర సరకులు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో వాడే ఈ-పోస్ యంత్రాలు అన్నీ ఒకే సర్వర్‌కు అనుసంధానమై పనిచేస్తున్నాయి. నెలవారీ సరకులతోపాటు సంక్రాంతి కానుకలను ఒకే సారి ఇవ్వాల్సి రావడంతో సర్వర్‌పై భారం పెరిగింది. దీంతో ఈ-పోస్ యంత్రాలు పని చేయడంలేదు. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 20 మందికి మించి సరకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లు పేర్కొంటున్నారు. సరకులు ఇవ్వడం ప్రారంభించిన పావుగంటకే ఈ-పోస్ యంత్రాలు ఆగిపోతున్నాయని, తిరిగి గంటకో, రెండు గంటలకో పనిచేస్తున్నాయని, మళ్లీ అరగంటే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించే నాథుడే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోరుున తరువాత సర్వర్ పనిచేస్తోందని డీలర్లు పేర్కొంటున్నారు.
ఒకేసారి చంద్రన్న కానుక, నెలవారీ సరుకుల పంపిణీ
సంక్రాంతికి ప్రత్యేకంగా ఇచ్చే కానుకతోపాటు నెలవారీ సరకులను కూడా ఒకే సారి ఇవ్వాల్సి వచ్చింది. అరుుతే ఒక సారి కాకుండా రెండు సార్లు వేలిముద్రలు తీసుకుని కానుక, నెలవారీ సరుకులు ఇస్తున్నారు. దీంతో సరకుల పంపిణీలో జాప్యం జరుగుతోందని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. నగదు రహితంగా సరకులు పంపిణీ చేస్తున్నందున కార్డుదారుడి వేలిముద్ర తీసుకున్న తరువాత అతని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి అందులో తగినంత సొమ్ము ఉందో లేదో చూసుకుని ఆ తరువాత బిల్లు జారీ చేసేం దుకు సమయం పడుతోందని డీలర్లు చెబుతున్నారు. దీనివల్ల గంటకు ఐదారుగురు కంటే ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నామని వివరిస్తున్నారు. కార్డుదారుడికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నా.. అందులో ఏ ఒక్కటీ పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.
ఎప్పటికి పూర్తయ్యేనో..?
విజయవాడ నగరంలో ఆరేడు వందల కార్డులు ఉన్న దుకాణాల్లో ఇప్పటి వరకు కేవలం రెండు వందల కంటే ఎక్కువ మంది కార్డుదారులకు సరకులు ఇవ్వలేకపోయారు. 15వ తేదీతో చంద్రన్న కానుక ఇవ్వాల్సిన గడువు పూర్తవుతుంది. ఆ లోగా కానుక అందుకోలేమోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో కార్డుదారులకు సరకులు ఇవ్వకపోతే అటు అధికారులు అనుమానిస్తారని, ఇటు కార్డుదారుల నుంచి విమర్శలు తప్పవని డీలర్లు పేర్కొంటున్నారు. అందువల్ల ఆదివారం, పండుగ రోజులు, రాత్రి, పగలు అని చూడకుండా సరకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
వేర్వేరుగా ఇవ్వడం వల్లనే.
రేషన్ దుకాణాల్లో సరకులు సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది రాలేదు. ఈ సారి సంక్రాంతి కానుక, నెలవారీ సరకులు ఒకేసారి ఇస్తున్నాం. అందువల్ల రెండుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో జాప్యం జరుగుతోంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకే కార్డుదారుడు రెండుసార్లు వేలిముద్ర వేసి సరుకులు తీసుకోవడం వల్ల ఈ-పోస్ మిషన్లు, సర్వర్లపై ఎక్కువ భారం పడుతోంది. అరుునా రికార్డుస్థారుులో అవి పనిచేస్తూనే ఉన్నాయి.
- బాబు.ఎ, కలెక్టర్
గంటల తరబడి వేచి ఉంటున్నాం
రేషన్ అందక గంటల తరబడి వేచి ఉంటున్నాం. సర్వర్ పని చేయక మూడు రోజుల నుంచి దుకాణం చుట్టూ తిరుగుతున్నాం. పట్టించుకునే నాథుడే లేడు. పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నాం. రేషన్ సరకులు ఎప్పడు అందుతాయో?
- సాయి లక్షి, సతన్యనారాయణపురం
కాళ్లరిగేలా తిరుగుతున్నాం
రేషన్ సరుకుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. రేషన్ దుకాణానికి వెళ్లే సర్వర్ పనిచేయడం లేదని డీలర్ అంటున్నారు. అర్ధరాత్రి వరకు వేచి ఉన్నా సరుకులు అందడం లేదు. సంక్రాంతి పండుగకు నిత్యావసర సరకులు అందించాలి.
- కోనా మహలక్ష్మి, చుట్టుగుంట