సేవలోనే సంతృప్తి
సేవలోనే సంతృప్తి
Published Sat, Feb 4 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
– ఎంపీ ఎస్పీవైరెడ్డి
– నంద్యాలలో రోటరీ ఇంటర్నేషనల్ సదస్సు ప్రారంభం
– హాజరైన రెండు రాష్ట్రాల క్లబ్‌ల ప్రతినిధులు
నంద్యాల:
సమాజానికి, ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి, ఆనందం దాగి ఉంటుందని ఎంపీ ఎస్పీవైరెడ్డి చెప్పారు. స్థానిక వైజంక‌్షన్‌లోని సౌజన్య కన్వెన్షన్ హాల్‌లో శనివారం రోటరీ క్లబ్ 3160 ఇంటర్నేషనల్ సదస్సు గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో కర్ణాటకలోని ఏడు, ఏపీలోని ఆరు జిల్లాలలోని 68 క్లబ్‌లకు చెందిన వెయ్యిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులుగా ఎంపీతోపాటు మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, మునిసిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ చిరునవ్వుతో ఎంత కష్టానైనా సాధించవచ్చన్నారు. నంద్యాలలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కందుకూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. మాజీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోలియో వ్యాధి నిర్మూలనకు రోటరీ క్లబ్ చేసిన సేవలు ప్రశంసానీయమన్నారు. క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం క్లబ్ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అద్యక్షుడు రమేష్, కాన్ఫరెన్స్ చైర్మన్ చిన్నపురెడ్డి, క్లబ్ పీడీజీ గుర్జీత్‌సింగ్ శిఖోన్, క్లబ్ ఇన్నర్‌వీల్ చైర్‌పర్సన్ వీణాస్వామి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బరామయ్య, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ రొటేరియన్లు విజయశేఖర్‌రెడ్డి, నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ మధుసూదనరావు, నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement