తొలి రోజు ఏడు కుటుంబాలకు షర్మిల పరామర్శ
మెదక్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మెదక్ జిల్లాలో తనువు చాలించిన వారి కుటుంబ సభ్యులను... వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం పరామర్శించారు.
బాధిత కుటుంబీకుల కన్నీళ్లను తుడిచి కష్టాల్లో అండగా ఉంటానంటూ షర్మిల భరోసానిచ్చారు. మాతృమూర్తులను కోల్పోయిన చిన్నారులకు ధైర్యం చెప్పారు. ఆదివారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, కొండపాక మండలాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఉదయం 11:10 ప్రాంతంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా దండుపల్లి షర్మిల చేరుకున్నారు. వర్గల్ మండలం అంబర్‌పేట, మీనాజీపేటల్లో షర్మిలకు ఘనం స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ.. మహిళలను షర్మిల అప్యాయంగా పలకరించారు.
అంబర్‌పేటలో మన్నె జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి భర్త నాగమల్లేష్, కుమారులను పరామర్శించారు. జయమ్మ ఎలా చనిపోయింది ? అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్గల్‌లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శ్రీపతి శకుంతల, బందారం గ్రామంలో నమిలె పోచయ్య కుటుంబీకులను షర్మిల పరామర్శించారు.
షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడి, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఏపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్‌రెడ్డి, తెలంగాణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయ తదితరులు పాల్గొన్నారు.