22 నుంచి మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
22 నుంచి మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
Published Wed, Jan 25 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
– 24న మహాశివరాత్రి, లింగోద్భవం
– 26న రథోత్సవం
మహానంది : మహానంది పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 22 నుంచి 27వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై బుధవారం మహానంది దేవస్థానం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 20వ తేదీన శ్రీ గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులు పెళ్లిపెద్ద అయిన శ్రీ పార్వతీ సమేత బ్రహ్మానందీశ్వరస్వామి వారిని ఆహ్వానించేందుకు నంద్యాలకు వెళ్తాయన్నారు. 21న నంద్యాల నుంచి మహానందికి చేరుకుంటాయన్నారు. 22న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 24న మహా శివరాత్రి, లింగోద్భవం, 25వ తేది తెల్లవారుఝామున స్వామి వారి కల్యాణోత్సవం, 26న ర«థోత్సవం ఉంటుందన్నారు. 27న ఉదయం మహాపూర్ణాహుతి, త్రిశూలస్నానం, ధ్వజ అవరోహణం, పూజలతో శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
శివరాత్రిలోగా ఫ్లోరింగ్...నంది విగ్రహ ఏర్పాటు:
మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేనాటికి నందిసర్కిల్ వద్ద భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని డీసీ డాక్టర్ శంకర వరప్రసాద్ తెలిపారు. అలాగే ఆలయంలో తూర్పు భాగంలో ఫ్లోరింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఉత్సవాల ఆహ్వానపత్రికల ముద్రణ, పూల అలంకరణ, స్వామివారి కల్యాణోత్సవాలకు దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు బాలరాజుయాదవ్, అర్చకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement