ఇక ఎదురుదాడే!
♦ బాబు తరహాలో టీడీపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేయాలి
♦ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో : కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ తమపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎదురు దాడికి దిగాలని దాని మిత్రపక్షమైన బీజేపీ నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ ఈ మేరకు ఇక్కడి నేతలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నట్లు చెబుతూనే.. కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయడంలేదని ప్రచారం చేస్తుండటం, ప్రతిచోటా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తుండడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. బాబు ఎలాగైతే ప్రధాని, కేంద్ర మంత్రులను విమర్శించకుండా పరోక్షంగా కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు చేస్తున్నారో ఇకపై బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలని సింగ్ సూచించినట్లు తెలిసింది.
అవినీతిని ఎండగట్టండి..: అవినీతి వ్యవహారాలను వదలకుండా ఎండగట్టాలని, అంశాలవారీగా.. ఉదాహరణలతో వాటిని వివరించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు వివరించారు. ఈ సమయంలో టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు నేతలు కేంద్రంపై విమర్శలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నేతలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని లేవనెత్తగా వాటిపైనా స్పందించాలని అయితే అధికార పార్టీ అవినీతికి బీజేపీ మద్దతు లేదనే విషయం ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యవహరించాలని సిద్ధార్థనాథ్‌సింగ్ సూచించారు.