'సభ'లో సడేమియాలు | clashese to ap assembly | Sakshi
Sakshi News home page

'సభ'లో సడేమియాలు

Published Wed, Aug 27 2014 12:00 AM | Last Updated on Fri, Mar 29 2019 5:35 PM

'సభ'లో సడేమియాలు - Sakshi

'సభ'లో సడేమియాలు

కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం మొదలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం దాకా - అసలు ప్రతిపక్షం అనేది లేకపోతే బాగుండునన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.అటు కేంద్రంలో చూస్తే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేసి ఏకపక్ష పాలనకు బీజేపీ దారులు వెతుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే రీతిలో నడుస్తోంది. సభలో ఏకైక విపక్షంగా ఎంపికైన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులను ఆ పార్టీ నుంచి ‘ఖాళీ’ చేయించి ఏకపక్ష పాలన సాగించుకోవాలని చూస్తోంది.
 
బ్రిటిష్ పాలనా కాలం నాటి సెంట్రల్ లెజిస్లేచర్‌లో గానీ, స్వాతంత్య్రానంతరం తొలి పార్లమెంటులోగానీ, లెజిస్లేచర్‌ల సభాపతుల స్థానాలను అధిష్టించిన విఠల్ భాయ్ పటేల్, దాదాసాహెబ్ గణేశ్ వాసుదేవ్ మావ లంకర్, అనంతశయనం అయ్యంగార్, నీలం సంజీవ రెడ్డి వంటి హేమాహేమీలు ఏదో ఒక రాజకీయ పక్షానికి చెందినవారే. అయినా ఒకసారి అన్ని పక్షాలు కలసి ఆ ఉన్నత స్థానానికి ఎంపిక చేసిన తరువాత పాక్షిక రాజకీయాల నుంచీ, ఆ స్థానాల నుంచీ వ్యాఖ్యలు చేయలేదు. తీర్పులు ఇవ్వలేదు. అంతటి సమున్నత విలువలతో వారు సభలను నడిపించారు.

ఏవీ ఆ అడుగుజాడలు

తొలి లోక్‌సభ స్పీకర్ మావలంకర్. ఆయన అంతకు ముందు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెం బ్లీ (1946-47) అధ్యక్షుడు. రాజ్యాంగ సభకు, తాత్కా లిక పార్లమెంటుకు (1947-1950) మావలంకర్ అధ్య క్షునిగా పనిచేశారు. సభా గౌరవానికి దీటుగా సభాప తులు ఎలా వ్యవహరించాలో ఆయనే కొన్ని సూత్రాలను నిర్దేశించారు. పార్లమెంటరీ వ్యవస్థ సక్రమ పద్ధతులలో నడవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపా దిస్తూ ఎన్నటికీ మరపురాని మహోపన్యాసం చేశారు. తొలి స్పీకర్‌గా మావలంకర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రథమ ప్రధాని నెహ్రూ తీర్మానాన్ని ప్రతిపాదించగానే (మే 15, 1952) సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తరువాత మావలంకర్ ఇచ్చిన ఉపన్యాసంలో కలకాలం స్మరించుకోదగిన ఆణిముత్యాలను పేర్కొన్నారు.

‘మనం అందరం దేనికోసం కృషి చేయాలో రాజ్యాం గం ఉపోద్ఘాతంలోనే స్పష్టంగా ఉంది. దేశ ప్రజలందరికి సమన్యాయం. స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం సాధించి పెట్టాలన్నదే ఆ ఆదేశం. లెజిస్లేచర్‌లో మనం మాట్లాడే ప్రతి మాటనూ, ప్రతి చర్యనూ ఈ సమష్టి లక్ష్యం నుంచే చూడాలి. ఆచరించాలి. రాజ్యాంగం ఆశిస్తున్న ఈ ప్రాథ మిక ఆదర్శాలకు మనం కట్టుబడి ఉంటే, పార్లమెంటరీ వ్యవస్థ సమర్థంగా నడిచేందుకు తగిన శుభకరమైన వాతావరణం ఏర్పడుతుంది’ అన్నారాయన. వీటన్నిటినీ గౌరవించే ప్రభుత్వాలు ఉంటేనే మంచి వాతావరణానికి అవసరమైన ఆదర్శవంతమైన చర్చ సాగించగలవని ఆయన ఆశించారు. సభలోని అన్ని పక్షాలు కలసి స్పీకర్ పదవికి ఎంపిక చేసిన వ్యక్తి ఆ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏ పార్టీకి ‘అనుబంధ గొంతు’గా కాకుండా అందరి వాణినీ, వ్యాఖ్యనీ, తీర్పునూ వినిపిం చాలని మావలంకర్ అన్నారు. అలా అని స్పీకర్ ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాకుండా పోడు. కానీ, ఆ పార్టీకి ఆయన అనుబంధంగా ఉండడానికి వీలులేదు. ‘అందు వల్ల సభాపతి విశిష్ట సంప్రదాయాలకు ప్రతినిధిగా నడుచుకోకుంటే దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాలు నిలదొక్కుకోలేవు. మన స్పీకర్లు తమ తమ పార్టీల చర్చలకూ వాటి వివాదాలకూ దూరంగా ఉండవచ్చు గాని స్పీకర్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి అసలు రాజకీయవేత్త కాకుండా పోడు’ అని కూడా మావలంకర్ చెప్పారు.

విపక్షాన్ని ఖాళీ చేయడమే ధ్యేయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవలి సరళిని బట్టి చర్చలు పక్కదారులు పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నా రంటే, అందులో తప్పులేదని అనిపిస్తుంది. నిజానికి జాతీయ స్థాయిలో పాలకపక్షాలు అనుసరిస్తున్న పెడధో రణుల ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకుం టోంది. కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం మొదలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం దాకా - అసలు ప్రతిపక్షం అనేది లేకపోతే బాగుండునన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటు కేంద్రంలో చూస్తే కాం గ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేసి ఏకపక్ష పాలనకు బీజేపీ దారులు వెతుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే రీతిలో నడుస్తోంది. సభలో ఏకైక విపక్షంగా ఎంపికైన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యు లను ఆ పార్టీ నుంచి ‘ఖాళీ’ చేయించి ఏకపక్ష పాలన సాగించుకోవాలని చూస్తోంది. ఇక్కడ అసెంబ్లీ సమావే శాలూ, అక్కడ పార్లమెంటు సమావేశాలూ ప్రారంభం కాకముందు నుంచే ‘ప్రతిపక్ష’ సభ్యులకు  ‘ఎర’ పెట్టి ఫిరాయింపులకు ప్రోత్సహించడాన్ని ప్రజలూ పరిశీల కులూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రానికి ‘హామీలు’ తప్ప ఇవ్వలేని, వాటిని నెరవేర్చి చూపలేని ప్రభుత్వాలన్నీ ధనస్వామ్య వ్యవస్థలో తొక్కే అడ్డదారులన్నీ ఇలాగే ఉంటాయి.

చర్చను పక్కదోవ పట్టించే కుట్ర

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండు రోజుల పాటు చర్చంతా ప్రధానంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల హత్యల చుట్టూనే సాగింది. ఎన్నికల తరు వాత గత మూడు నెలల్లో తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను టీడీపీ వారు హత్య చేశారనీ, ఆ అంశాన్ని చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుపట్టారు. కానీ అధికార పక్షం బాధ్యతా రాహిత్యంతో ఈ సమస్యతో ఏమీ సం బంధం లేని మరొక అనవసర చర్చకు తెరలేపింది. ఈ చర్చలో ఆరోపించడానికి ఏమీ దొరక్క, ‘వెనుకటికి మీ తాత పొగచుట్ట తాగాడ’న్న ఫిర్యాదు లాంటి ఆరోప ణలను పాలకపక్షం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హంత కుడని, రుజువులు చూపకుండా విమర్శలు కురిపిస్తే, వాటి గురించి చెప్పడానికి ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన తనయుడు జగన్‌ను ‘రాజకీయ ఉన్మాది’ అనీ, ‘ఆర్థిక ఉన్మాది’ అనీ పాలకపక్షం విమర్శిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన కేసులను ఆధా రం చేసుకుని, ఇంకా రుజువు కాని కేసులను పట్టుకుని టీడీపీ సభ్యులు ఈ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే విపక్షం ఇన్ని విమర్శలు కురిపిస్తున్నా తన తాతగారు రాజారెడ్డి హత్యోదంతాన్ని ఈ సందర్భంగా జగన్ ఉపయోగించుకోకపోవడం గమనించవలసిన విషయం. నిజానికి తమ పార్టీ కార్యకర్తల హత్యలపై, శాంతి భద్ర తలపై చర్చ జరగాలని జగన్ పట్టుపట్టిన తరువాతే, పాత హత్యలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ కుటుంబం మీద అధికార పక్షం ఎదురుదాడిని మొదలుపెట్టింది.

పరిటాల రవి, వంగవీటి రంగా హత్యల ప్రస్తావన అలా వచ్చిందే. కానీ ఇటీవల జరిగిన హత్యలను గురించి ప్రస్తావించడం టీడీపీ వారికి ఇష్టం ఉండదు. చిత్రం ఏమిటంటే పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న జగన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా సరే, తెలుగుదేశం సభ్యులు అదే అంశాన్ని పట్టుకుని సాగతీస్తున్నారు. జగన్ నిర్దోషిత్వం గురించి వెల్లడికాకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిగి దోషులకు శిక్షలు కూడా పడ్డాయి. ఇంతకీ ఈ కేసులో నిందితులు జేసీ సోదరులకు టీడీపీయే టికెట్లు ఇవ్వడం దీనికి కొసమె రుపు. ఇలాంటి వారందరినీ తన పంచన చేర్చుకుని ఎదురుదాడికి దిగడం, విపక్షం నోరు నొక్కాలని యత్నిం చడం ఏం న్యాయం?  వాస్తవానికి తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన హత్యలకూ, ఎన్‌కౌంటర్లకూ అంతే లేదు. విజయవాడలో జరిగిన వంగవీటి రంగా హత్య కూడా అందులో భాగమేనన్న ఆరోపణల నుంచి ఇంత వరకు తెలుగుదేశం బయటపడలేదు. ఈ కేసులో ముద్దా యి వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. నిజాయితీ ఉంటే బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పాలి. ఆ కుటుంబాలకు సాంత్వన ఇవ్వాలి. అంతేగానీ మృతులను తాగుబోతులని నిందించడం సబబు కాదు. ఇవన్నీ వదిలిపెట్టి జగన్ మీద చేసిన ఆరోపణలనే ఎన్నాళ్లు చేస్తారు? ఇది ఎంత వరకు సబబు?

సభను అగౌరవపరిచే పదజాలం

వైఎస్‌ఆర్‌సీపీనీ, ఆ పార్టీ నేత జగన్‌నూ ‘హంతకులు’, నరహంతకులు’ వంటి పదాలతో తెలుగుదేశం సభ్యులు నిందలు వేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరు ద్ధం. ఇలాంటి పదాలను అధికారికంగా నిషేధించిన సం గతి అధికార పార్టీ సభ్యులకు తెలిసినట్టు లేదు. పార్ల మెంటరీ పరిభాషా పదాలను క్రోడీకరించి, తొలి పది లోక్‌సభలలో సభ్యులు ప్రయోగించిన అభ్యంతరకర పదాలను కలిపి 1999లో లోక్‌సభ సచివాలయం పుస్త కంగా వెలువరించింది. నిషేధించినవాటిలో ‘మర్డరర్స్’ (పే.239) అన్న పదం ఒకటి. కానీ ఈ పదాలను యథే చ్ఛగా వాడినా తప్పించుకుంటున్న వారు ‘బఫూన్’, ‘చిలిపి ప్రవర్తన’, ‘అవివేక ప్రవర్తన’ వంటి పదాలు జగన్ నోటి నుంచి వచ్చినందుకు ఎదురుదాడికి దిగారు. నిజానికి ఈ ప్రయోగాలు ఏవీ నిషేధిత పదాల పట్టికలో చేరలేదు.

దాచేస్తే దాగవు సత్యాలు

అసలు టీడీపీ హయాంలో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగా యి! ఎన్ని స్కాములు జరిగాయి! మురళీధరన్, ముది గొండ పద్మలను అంతమొందించిన తీరు ఎలాంటిది? డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల హత్యలు ఏం చెబుతున్నాయి? దాదాపు 300 మంది నక్సల్స్‌ను ఎన్ కౌంటర్ చేసిన ఘనత ఎవరిది? గద్దర్ గుండెను గురిచే సిన తుపాకీ ఏ ప్రభుత్వం హయాంలోనిది?  అలాగే ఎన్టీఆర్‌పై జరిగినట్టు చెబుతున్న హత్యాయత్నం గురిం చి కూడా కొంచెం చెప్పుకోవాలి. మల్లెల బాబ్జీ అనే యువకుడు జరిపినట్టు చెబుతున్న ఈ హత్యాయత్నం కథ విఠల ఆచార్య సినిమా ఫక్కీలో నడిచింది. చివరికి ఆ బాబ్జీదే విదూషకుడి ఆత్మహత్యలా చూపించిన తీరు నభూతో నభవిష్యతి కాదా! ఈ ఉదంతం మీద రోజుకో బుట్టలో నుంచి ఒక్కొక్క కొత్త పాము బయటకు వస్తుం టే, ఎందుకైనా మంచిది అని బాబ్జీ హత్యాయత్నం ఉ దంతం మీద జస్టిస్ శ్రీరాములు కమిషన్‌ను నియమిం చారు. ఈ కమిషన్ ఆ హత్యాయత్నం కేసంతా ఒక డ్రామా అని తేల్చి చెప్పలేదా? ఆ రికార్డు ఇప్పటికీ సచి వాలయంలో ఉందా? లేదా? ఈ విషయాలన్నీ మాజీ ముఖ్యమంత్రి, నాటి ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కర రావు జీవిత చరిత్ర (నా జీవిత ప్రస్థానం)లో నమోదైనా యా, లేదా! అసలు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న శాంతిభద్రతల చర్చకు ముఖ్యమంత్రి ఎందుకు గైర్హాజరై నట్టు? చర్చ ఆరంభంలో తాను నీతిమంతుణ్ని అని చాటుకున్న ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తు న్నట్టు? ధనస్వామ్య పాలకులు తెచ్చి పెట్టుకున్న అహంకారాలు నిజాన్ని దాచలేవు.

చిత్రం ఏమిటంటే పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న జగన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా సరే, తెలుగుదేశం సభ్యులు అదే అంశాన్ని  పట్టుకుని సాగతీస్తున్నారు. జగన్ నిర్దోషిత్వం గురించి వెల్లడికాకుండా జాగ్రత్త పడుతున్నారు.

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)    ఏబీకే ప్రసాద్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement