కఠినంగా వ్యవహరించాలి
హెల్మెట్ నిబంధనపై హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించని వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే పురోగతి కన్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ వాడని వాహనదారులను ఆపి, జరిమానాలు విధిస్తున్నట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని, కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు 2009లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు విచారించింది. సోమవారం మరోసారి విచారించింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారు రోజూ తమకు అత్యధికంగా కనిపిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే 49 వేల కేసులు నమోదు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందేపల్లి సంజీవ్ కుమార్ చెప్పారు. ఎన్ని ద్విచక్ర వాహనాలున్నాయని ధర్మాసనం ప్రశ్నించగా, 40 లక్షలున్నాయని సంజీవ్ చెప్పారు. దీని ప్రకారం ఒక్క శాతం మేర కేసులను మాత్రమే నమోదు చేశారంటూ హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.