సస్పెండైన ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం
♦ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆలౌట్ తాగిన సైదులు
♦ ఆస్పత్రికి తరలింపు, నిలకడగా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన వనస్థలిపురం ఎస్‌ఐ సైదులు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాల యంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. గణేశ్ మండపాల నిర్వాహకుల నుంచి, రేషన్ దుకాణం కేసులో దుకాణ నిర్వాహకుడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో సైదులును సస్పెండ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. శనివారం మధ్యాహ్నం సీపీని కలిసేందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ కెమికల్‌ను తాగాడు.
గమనించిన సిబ్బంది సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోనే చికిత్స పొందుతున్న సైదులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా అవినీతికి పాల్పడి బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తప్పులు చేసి.. అవి బయటపడి సస్పెండ్ అయి.. ఆత్మహత్యాయత్నం చేసి బెదిరిస్తే సహించేది లేదన్నారు. అవినీతి ఆరోపణలు మా దృష్టికి రావడంతో దాదాపు 2 నెలల పాటు అంతర్గత విచారణ జరిపి పూర్తి సాక్ష్యాలు సేకరించాకే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.