వసూల్‌ రాజా | Buchireddypalem SI Corruption Story | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజా

Published Mon, Apr 2 2018 9:17 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Buchireddypalem SI Corruption Story - Sakshi

బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌ , పేరం నాగశివారెడ్డి, ఎస్సై

బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై పేరం నాగశివారెడ్డి అవినీతికి కేరాఫ్‌గా నిలిచాడు. గతేడాది మే 19న  బాధ్యతలు స్వీకరించాడు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన ఈయన నెల్లూరు జిల్లాలో తొలిపోస్టింగ్‌ బుచ్చిరెడ్డిపాళెంలోనే. నెల రోజులపాటు ట్రాఫిక్, శాంతిభద్రతలపై దృష్టి సారించిన ఎస్సై అనంతరం దృష్టి మరల్చాడు. సీఐ సుబ్బారావుతో కలిసి పలు విషయాల్లో మామూళ్లకు పాల్పడ్డాడు. మామూళ్లే లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించాడు. అతని అవినీతి పర్వం ఎస్పీ రామకృష్ణ దృష్టికి వెళ్లడంతో వీఆర్‌కు వెళ్లాడు. 

మామూళ్లు ఇస్తే సరి.. లేకుంటే గురి
స్టేషన్‌కు వచ్చే ప్రతి విషయాన్ని ఎస్సై తన వ్యాపారాలకు అనుగుణంగా మలుచుకున్నాడు. అందుకు స్టేషన్లో ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత ఎస్సై బాధితులను బెదిరించేవాడు. తరువాత కానిస్టేబుల్‌ను పంపి వ్యాపారాన్ని పక్కాగా చక్కబెట్టేవాడు. కానిస్టేబుల్‌కు నోట్లు అందిన వెంటనే ఎంతటి కేసైనా చిటెకెలో పరిష్కారమయ్యేది. ఒకవేళ ఎవరైనా ఇవ్వనంటే వారికి నరకం చూపేవాడు. వారినే లక్ష్యం చేసుకుని ప్రతి విషయంలోను ఇబ్బంది పెట్టేవాడు.

మామూళ్ల పర్వం ఇలా..
ఎస్సై నాగశివారెడ్డి మామూళ్ల పర్వంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
మండలంలోని రామచంద్రాపురానికి చెందిన ఓ గిరిజన మైనర్‌ బాలికను అదే గ్రామానికి చెందిన ఓ కామాంధుడు అత్యాచారం చేసి వదిలేశాడు. సదరు బాలిక కుటుంబసభ్యులు నాగశివారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తి నుంచి మామూళ్లు తీసుకుని కేసు లేకుండా చేశాడు.
సెల్‌ఫోన్ల దొంగతనం విషయంలో దొంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజానగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్నాడు. ఇదే కేసులో మహిళల నుంచి రూ.7 వేల నగదు లంచంగా కానిస్టేబుల్‌ ద్వారా తీసుకున్నాడు.
లారీని పట్టుకున్న కేసులో తొలుత కేసు నమోదు చేయకుండా రూ.15 వేలు లంచం తీసుకున్నాడు. తరువాత సీఐ వద్దకు పంపాడు. సీఐకు లంచం అందేలా చేశాడు. అంతటితో ఆగక డీఎస్పీ వద్దకు వెళ్లమన్నాడు. దీంతో విరక్తి చెందిన లారీ యజమాని కేసు నమోదు చేయండి.. కోర్టులో విడిపించుకుంటాం అని చెప్పడంతో కేసు నమోదు చేశారు.
మండలంలోని కాగులపాడుకు చెందిన ఓ వివాహిత 20 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్న విషయంలో వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిని ఎస్సై నాగశివారెడ్డి బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని బ్రోకర్‌గా పెట్టుకుని రూ.40 వేలు లంచం తీసుకున్నాడు.
అప్పుగా తీసుకున్న వ్యక్తి నుంచి నగదు వసూలు చేసేందుకు లంచం తీసుకున్న నాగశివారెడ్డి సదరు వ్యక్తి ద్విచక్రవాహనాన్ని అప్పుకు జమచేసేలా చేశాడు.
ముంబయి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కు లైసెన్స్‌ లేకపోవడంతో మరొకరి పేరు చేర్చి మామూళ్లకు పాల్పడ్డాడు. 

నెలసరి మామూళ్లిలా..  
మండలంలోని విలియమ్స్‌పేట, రామచంద్రాపురంలో జరుగుతున్న గ్రావెల్‌ రవాణాకు సంబంధించి ప్రతి నెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.5 వేలు ప్రతినెలా లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
ఇసుక, మట్టి తదితర అక్రమ రవాణాల నుంచి మామూళ్లు అందుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు.

నకిలీ విలేకరులను మధ్యస్తంగా..
నకిలీ విలేకరులను మధ్యస్తంగా పెట్టుకుని ఎస్సై నాగశివారెడ్డి మామూళ్లు వసూలు చేసినట్లు బాధితులే నేరుగా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. తన నుంచి ఎస్సై నాగశివారెడ్డి విలేకరులను అడ్డుపెట్టుకుని లంచం వసూలు చేసినట్లు ముద్ర రుణాల మోసగాడు ఆవుల వెంకటేశ్వర్లు పోలీసుల ఉన్నతాధికారుల విచారణలో వెల్లడించాడు. ఇదే విషయాన్ని నాగశివారెడ్డితోను చెప్పాడు. తాజాగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ మామూళ్లు వసూలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యక్తిని మధ్యస్తానికి ఉపయోగించినట్లు ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లింది.

శాంతిభద్రతలు గాలికి...
ఎస్సై నాగశివారెడ్డి మండలంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశాడు. పట్టపగలు గొలుసుదొంగలు మహిళల మెడలో నుంచి చైన్లు తెంచుకెళుతున్నా దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవు. హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదు. రికార్డింగ్‌ డ్యాన్సులకు అనధికారికంగా అనుమతులిస్తూ ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాడు. హిజ్రాల నృత్యాలతో గొడవలు జరుగుతున్నా ఆపిన దాఖలాలు లేవు.

ఉన్నతాధికారుల దృష్టికి..
మామూళ్లే ధ్యేయంగా పనిచేసిన ఎస్సై పి.నాగశివారెడ్డి అవినీతి పర్వం ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ దృష్టికి వెళ్లింది. బాధితులకు జరిగిన అన్యాయం, ఎస్సై లంచగొండితనంపై ఎస్పీ విచారణ జరిపారు. వసూల్‌ రాజా నాగశివారెడ్డికి చెక్‌ పెట్టారు. వీఆర్‌కు పిలుస్తూ శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. కాగా ఎస్సైని సస్పెండ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement