రక్షకులకే శిక్ష!
రక్షకులకే శిక్ష!
Published Wed, Aug 2 2017 12:15 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
ఇరగవరం ఎస్సైకి బదిలీ బహుమానం
కుక్కునూరులో పోస్టింగ్
తణుకు ఎమ్మెల్యే అవమానించినా
ఆదుకోని పోలీసుబాస్‌లు
మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే
ఎస్పీ బదిలీలోనూ ఇదే వైఖరి
జిల్లాలో పోలీస్ ఉద్యోగం బలిపీఠంగా మారింది. అధికారపార్టీ ఆగడాలకు ఏమాత్రం అడ్డుచెప్పినా.. రక్షకులే బలికావాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఘటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఫలితంగా పోలీసుశాఖలోనూ, ప్రజల్లోనూ అధికారపార్టీ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అధికార పార్టీకి ఎదురువెళ్తే ఏమవుతుందో ఇప్పుడు పోలీసులకూ తెలిసివస్తోంది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట విననందుకు నిర్బంధానికి గురైన పోలీసు అధికారికి బదిలీ బహుమానంగా దక్కింది. అదీ జిల్లాకు సుదూరంగా ఉన్న ముంపు మండలమైన కుక్కునూరుకు.. పోలీసులపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే మాట నెగ్గించుకుని ఎస్సైని బదిలీ చేయించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..
గత ఏడాది అక్టోబర్‌లో కేవీవీ శ్రీనివాస్ ఇరగవరం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈఏడాది మేలో ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరు వర్గాలలో చెరో ఆరుగురిపై 307 సెక‌్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆఖరికి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్ధారణ కావడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దీంతో మే 16న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్సై శ్రీనివాస్, రైటర్ ప్రదీప్‌కుమార్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని ’నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా మీకు ఎంత దమ్ము ఉందిరా’ అంటూ బూతులు తిట్టారు. ఆఫీసులో కింద నేలపై వారిని కూర్చోబెట్టి, తానూ వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయబోనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించారు.
ఎస్పీని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు
దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎస్పీని టార్గెట్ చేశారు. ఆ నెల 21న ఏలూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. వెంటనే ఆయనను బదిలీ చేయించాల్సిందేనని, అంతవరకూ తమకు గన్‌మెన్‌లూ వద్దని, వెనక్కి పంపించేస్తామని కొంతమంది గన్‌మెన్‌లను వెనక్కి పంపారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను జిల్లా నుంచి బదిలీ చేశారు.
ఇప్పుడు తాజాగా ఎస్సై
ఆ తర్వాత ఎస్సైనీ బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పట్టుపట్టడంతో ఇప్పుడు తాజాగా బాధితుడైన ఎస్సైనీ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి పరిపాలనా కారణాలు చూపి బదిలీ చేయడంపై పోలీసు శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే పద్ధతి కొనసాగితే పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement