సిద్దిపేట డీఎస్పీ బదిలీ | SIDDIPET DSP transfer | Sakshi
Sakshi News home page

సిద్దిపేట డీఎస్పీ బదిలీ

Published Sun, Aug 21 2016 2:23 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

సిద్దిపేట డీఎస్పీ బదిలీ - Sakshi

సిద్దిపేట డీఎస్పీ బదిలీ

- డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
- సీఐలు వెంకటయ్య, రామాంజనేయులు కూడా..
- ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో ‘ఓవర్ యాక్షన్’పై స్పందించిన డీజీపీ
- ప్రత్యేక విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు కుదింపు
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఘటనపై ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం స్పందించింది. ఎస్‌ఐ మృతిపై జరుగుతున్న విచారణ తీరు విషయంలో మీడియాలో కథనాలు రావటంతో డీజీపీ అనురాగ్ శర్మ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌ను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణ ముగిసేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు.

రామకృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న తొగుట పాత సీఐ వెంకటయ్య, కొత్త సీఐ రామాంజనేయులును డీజీపీ కార్యాలయానికి, హెడ్ కానిస్టేబుళ్లు ముత్యం, సంభాని, కానిస్టేబుళ్లు యాదవరెడ్డి, నాగిరెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటా చ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎస్‌ఐ ఆత్మహత్యకు పురిగొల్పిన అంశాల అన్వేషణ కోసం ప్రత్యేకంగా నియమించిన విచారణాధికారి ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి బాధ్యతలను కుదించి డీఐజీ అకున్ సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

 అలా అనాల్సింది కాదు: సబర్వాల్
 రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ప్రాథమిక సమాచారం లేకుండానే విచారణాధికారి స్పం దిస్తూ... తాగి సోరుుతప్పి కాల్చుకొని చనిపోయాడని, సూసైడ్ నోట్ కూడా తాగుబోతు రాతలుగా అభివర్ణించిన విషయాన్ని వివరిస్తూ.. ‘విచారణాధికారి ఓవర్ యాక్షన్ ’ అనే శీర్షికతో ‘సాక్షి ’ శనివారం సంచికలో ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డీఐజీ.. ప్రతాప్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదే సమయంలో రామకృష్ణారెడ్డి సోదరుడు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డికి ఫోన్  చేసి జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేశారు. విచారణ అధికారి అలా అనాల్సింది కాదని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు సబర్వాల్ చెప్పారు. కేసు విచారణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిష్పక్షపాతంగా జరిగేందుకు తానే విచారణ బాధ్యతలు స్వీకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

 హోం మంత్రిని కలసిన ఎస్‌ఐ భార్య
 తన భర్త ఆత్మహత్యకు కారణమైన దోషులను శిక్షించాలని కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి భార్య ధనలక్ష్మి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు కుటుంబ సభ్యులతో కలసి సచివాలయానికి వచ్చి మంత్రికి వినతి పత్రం అందజేశారు. తన భర్త చనిపోయే ముందు 6 పేజీల సూసైడ్ నోట్ రాశాడని, అందులో పేర్కొన్న డీఎస్పీ, సీఐల వేధింపుల కారణంగా చనిపోయినందున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కలత చెందామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నాయిని స్పందిస్తూ, విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
 
 రంగంలోకి అకున్  సబర్వాల్
 ప్రత్యేక విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి విచారణ తీరుపై విమర్శలు వస్తుండటంతో సబర్వాల్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం ఆయన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో కలసి కుకునూర్‌పల్లి పోలీసు స్టేషన్ ను సందర్శించారు. ఉదయం 12.30 గంటలకు స్టేషన్  ఆవరణలోకి చేరుకున్న డీఐజీ.. దాదాపు మూడు గంటల వరకు అక్కడే గడిపారు. సూసైడ్ నోట్‌లో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేసిన డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యతోపాటు మిగిలిన పోలీసులను పిలిపించి విచారించారు. ఎస్‌ఐ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితోనూ మాట్లాడారు. పోలీసు క్వార్టర్లలో తిరిగి పరిశీలించారు. ఈ సమయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన విలేకరులపై మెదక్ డీఎస్పీ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లు లాక్కుని ఫొటోలను డిలీట్ చేశారు. విలేకరులను సెల్‌లో వెస్తానంటూ బెదిరించారు. నాగరాజు తీరుపట్ల జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారుు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement