
శివలింగం @ 75 అడుగులు
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి పరిధిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో భారీ శివలింగ మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద శివలింగ మందిరం పుట్టపర్తిలో ఏర్పాటు కానుండటంతో బాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన పుట్టపర్తిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ శివలింగ మందిరం సుమారు 75 అడుగుల ఎత్తు ఉంది.
ఇందులో మూడు అంతస్తులు ఉంటాయని, అందులో లేజర్ షో, మెడిటేషన్ గది నిర్మాణం పూర్తయినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ఈ శివలింగ మందిరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పెయింటింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద శివలింగ మందిరమని ఫౌండర్ రతన్‌దాదా తెలిపారు. లండన్ నుంచి విచ్చేసిన ఆయన మూడు రోజుల నుంచి పుట్టపర్తిలో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.