అలరించిన ‘దైవం మానస రూపేణా’
పుట్టపర్తి అర్బన్: దశావతారాలు దాల్చిన భగవంతుడు.. కలియుగంలో సత్యసాయి అవతారం దాల్చి భక్తులను ఆదుకుంటున్నారన్న కథాంశంతో తెలంగాణ భక్తులు అత్యద్భుతంగా ప్రదర్శించిన నృత్య నాటకం అందరినీ అలరించింది. పర్తియాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల్ జిల్లాల నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మానవాళిని సత్యం, శాంతి, దయ, ప్రేమవంటి నాలుగు కాళ్లపై నడుపుతున్న మహోన్నత శక్తి సత్యసాయికి తప్ప మరో వ్యక్తికి లేదన్న భావంతో నిర్వహించిన నాట్య నృత్యం రంజింపజేసింది. ఈ సందర్భంగా సత్యసాయి సేవాదళ్ సభ్యుల అధ్యక్షుడు మాట్లాడుతూ, సత్యసాయి బాబా పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఉచిత అన్నదానం, ఉచిత వైద్యం, ఉచిత విద్య మానవాళికి వరాలన్నారు. అనంతరం మహామంగళహారతి, సత్యసాయిని కీర్తిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు.