రవి బాల శర్మ
సాధారణంగా 65 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ బాధపడేవారిని చూస్తుంటాం. కానీ, రవి బాల శర్మ బాలీవుడ్ తారలకు దీటుగా డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె అసలు పేరుకన్నా ‘డాన్సింగ్ దాదీ’గా ఫేమస్ అయ్యింది. మహిళలే కాదు యువత కూడా ఆమె డ్యాన్స్ స్టెప్పులకు ఆశ్చర్యపోతూ ఫాలో అవుతున్నారు. ఈ వయసులో పూజలు చేసుకోకుండా డ్యాన్సులు ఏంటి అనేవారికి మీలో స్కిల్స్ లేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఘాటుగా సమాధానం చెబుతుంది. ఇంతకీ ఎవరీ రవి బాల శర్మ...
‘‘నా పేరు ముందు రవి అని అబ్బాయిల పేరు ఉంటుంది. మా చెల్లి పేరు శశి ప్రభ శర్మ అంటే చంద్రుడు. నా పేరులో సూర్యుడు ఉండాలని రవి అని నాన్న అనుకున్నారట. అందుకే బాల అనే నా పేరు ముందు రవి చేర్చారు. చాలా మంది నా పూర్తి పేరు తెలుసుకోకుండా మిస్టర్ అని సంబోధిస్తుంటారు. నేను స్కూల్ టీచర్‌గా చేసే రోజుల్లో ప్రమోషన్ జాబితాలో నా పేరు కనిపించలేదు. విషయమేంటని ఆరా తీస్తే మగ టీచర్ల జాబితాల్లో నా పేరు ఉందని తెలిసింది.
సంగీత వారసత్వం
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పుట్టి పెరిగాను. మా ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉంటుంది. మా నాన్న సంగీత ఉపాధ్యాయుడు. అనేక వాద్యాలను వాయించేవాడు. ఆయన దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా చాలా బాగా పాడేది. కానీ, పిల్లల పెంకంలో ఆమె ఎప్పుడూ బిజీగా ఉండేది. మా నాన్న కొడుకు, కూతురు అనే తేడా చూడలేదు. నా కూతుళ్లు తమ కాళ్లపై తాము నిలబడగానే పెళ్లి చేస్తానని చెబుతుండేవాడు. దీంతో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం రాలేదు.
పాడటమే కాకుండా కథక్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. సితార్, తబలా కూడా వాయిస్తాను. హిందీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను. 27 ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా ఉన్నాను. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లలు, స్కూలు బాధ్యతలతో బిజీ అయిపోయాను. నా ఆసక్తుల గురించి పట్టించుకోలేదు. స్కూల్లో పిల్లలకు సంగీతం నేర్పించడంలో ఎంతో సంతృప్తి ఉండేది. కానీ, సంగీతం టీచర్లకు మిగతా టీచర్లకు ఉన్నంత ప్రాధాన్యత ఉండేది కాదు.
కొడుకుతో కలిసి..
నా భర్తకు కేన్సర్ అని తెలియగానే కుప్పకూలిపోయాం. అతని మరణం నన్ను బాగా కుంగదీసింది. కూతురికి పెళ్లయ్యింది. మా అబ్బాయి ఏకాంష్ రచయిత, నటుడు. దీంతో అతనితో పాటు ముంబై వచ్చాను. లాక్డౌన్ సమయంలో మా అబ్బాయి సోషల్ మీడియా అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేసేందుకు కొన్ని వీడియోలు షూట్ చేసేవాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూసి, వస్తున్న ప్రశంసలు చూసి నేనూ చాలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. మొదట్లో పెద్దగా వ్యూస్ రాకపోయినా తర్వాత ఫేమస్ అయ్యాను.
వైరల్ అయిన విధం..
గాయకుడు, గేయ రచయిత దిల్జీత్ దోసాంజ్ పాటకు డ్యాన్స్ చేసి, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే, ఆ వీడియోను అతను షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా డ్యాన్స్ టాలెంట్ నన్ను సోషల్ మీడియాకు ‘డ్యాన్స్ దాది’ని చేసింది. లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ తారలు
ఏ నటి పాటతో డ్యాన్స్ చేసినా ఆమె నా వీడియోను షేర్ చేసేంతగా పేరు రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది. ఈ వయస్సులో డ్యాన్స్ చేయడం చూసి వాళ్లూ ఆశ్చర్యపోతుంటారు. కానీ నా వయస్సును హాబీకి దూరంగా ఉంచుతున్నాను. నృత్యం నా హాబీ. అది నన్ను నా మనసులో ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. నా డ్యాన్స్ వీడియోలు చూసిన తర్వాత చాలామంది మహిళలు ‘మీ నుంచి చాలా స్ఫూర్తి పొందుతున్నామ’ని చెబుతుంటారు. చాలా మంది యువకులు కూడా నా డ్యాన్స్ ఫాలో అవుతున్నారు.
కొందరు మాత్రం ‘ఈ వయసులో పూజలు చేసుకోకుండా, డ్యాన్స్ ఎందుకు, నడుం పట్టేస్తుంది జాగ్రత్త’ అని కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వారికి నేను భయపడను. వారికి డ్యాన్స్‌లో స్కిల్ లేదు. కాబట్టి, వారికి ఆ కళ తెలియదు. విమర్శించేవారు వారి వ్యక్తిగత చిరాకుల కారణంగానే అలాంటి కామెంట్స్ చేస్తారు అనిపిస్తుంది. కొందరికి ఇష్టం ఉన్నా తమలో ఉన్న బిడియం వల్ల డ్యాన్స్ చేయలేరు. ఇంకొందరు తమకు నచ్చినది ఇతరులు చేయడం చూస్తే ‘నేనెందుకు చేయలేకపోయాను’ అని బాధపడతారు. ఇది ఒకరకమైన మానసిక రుగ్మత తప్ప మరొకటి కాదు. అలాంటి వారిపై మన శక్తిని వృథా చేయకూడదు. ఎందుకంటే అది మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది.
వయసు ఓ సంఖ్య మాత్రమే!
హృదయంలో పిల్లల్లాగే ఉండి, హాబీస్‌తో జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అదే, ఎన్నో విషాదాలను వెనక్కి నెట్టేస్తుంది. మీ హాబీ మిమ్మల్ని యంగ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాంటప్పుడు వయసు తన ప్రభావాన్ని చూపడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది. నేను డాన్స్ చేయకపోతే వయసు నన్ను ఓడించేది. కానీ, నా హాబీని సజీవంగా ఉంచుకుని, దానిని పూర్తి స్థాయిలో జీవించడం ద్వారా వయసును ఓడించాను’’ అని ఆనందంగా తెలియజేస్తారు ఈ డ్యాన్సర్.
Comments
Please login to add a commentAdd a comment