mistersidda
చిరుధాన్యాలతో రోగాలు దూరం
Published Wed, Sep 7 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
- మంత్రి శిద్దా రాఘవరావు
ఒంగోలు టౌన్ : చిరుధాన్యాలతో రోగాలు దూరమవుతాయని రాష్ట్ర రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాత రోజుల్లో ఆస్పత్రులు ఎక్కువగా ఉండేవి కావని, ఆనాటి ప్రజలు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడంతో రోగాల బారిన పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, ఒబెసిటీ (అధిక బరువు), మోకాళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. ప్రొటీన్లు, కాల్షీయం, ఇనుము, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న చిరుధాన్యాల వాడకంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడలని కోరారు. పౌష్టికాహార వారోత్సవాలను వారం రోజులకు పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని సూచించారు. చిరు ధాన్యాల వాడకం గురించి గ్రామ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తే వారి ఆహారపు అలవాట్లలో దానంతట మార్పు అదే వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలని మంత్రి సూచించారు.
విలన్‌లా కనిపిస్తున్న రైస్ : కలెక్టర్
రైస్ విలన్‌లా కనిపిస్తోందని కలెక్టర్ సుజాతశర్మ వ్యాఖ్యానించారు. రైస్‌ను పాలిష్ చేసిన తర్వాత ఆహారంగా తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్స్ పోతున్నాయన్నారు. కార్బోహైడ్రేట్ మాత్రమే మిగులుతోందన్నారు. ఫలితంగా బీపీ, షుగర్, వంటి రోగాలు వస్తున్నాయన్నారు. ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎక్కువ ఖర్చు అయినా మంచి ఫుడ్‌గా భావించి ఎక్కువ మంది తింటూ రోగాల బారిన పడుతున్నారన్నారు. సమతుల ఆహారమే మంచి పౌష్టికాహారమని, తక్కువ ఖర్చుతో దాన్ని పొందొచ్చన్నారు. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మహిళల చేతుల్లోనే ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడంలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి ఇంటిలో వండిపెట్టేవారు మహిళలే అయినందున వారికి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, మహిళా కమిషన్ సభ్యురాలు టి.రమాదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.విశాలాక్షి పాల్గొన్నారు.
ఆహా ఏమి రుచి!
పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శనను మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ సందర్శించారు. చిరుధాన్యాలతో అం గన్‌వాడీలు తయారు చేసిన రకరకాల వంటకాలు అదిరిపోయాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన కేక్‌ను కలెక్టర్ సుజాతశర్మ కట్ చేశారు. కేక్‌ను పక్కనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావుకు అందించారు. ఆ కేక్‌ను రుచి చూసిన కలెక్టర్ ‘ఆహా ఏమి రుచి’ అంటూ దాన్ని తయారు చేసిన అంగన్‌వాడీ కార్యకర్త జయశ్రీని అభినందించారు.
Advertisement
Advertisement