బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నిబంధనలను అటవీశాఖ గాలికొదిలేసింది.
► కేడర్ పోస్టులో నాన్ కేడర్ అధికారి నియామకం
► అటవీ శాఖలో ఉన్నతాధికారుల విస్మయం
సాక్షి, అమరావతి: బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నిబంధనలను అటవీశాఖ గాలికొదిలేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ముఖ్య కార్యదర్శి అనంతరాములకు తెలియకుండా కీలకమైన బదిలీలు జరిగిపోతున్నాయి. మంత్రికి, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి ఫైలు పంపకుండా రాష్ట్ర అటవీ దళాల అధిపతి పీకే సారంగి బైపాస్ చేసి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు పంపించి డీఎఫ్‌ఓలను బదిలీ చేస్తున్న తీరుపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) షేక్ సలాంను నియమిస్తూ ఈనెల 18న జారీ చేసిన జీవో 161 ఇందుకు నిదర్శనం.
ఇదీ విధానం: అటవీ శాఖ డీఎఫ్‌ఓల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ప్రతిపాదన ఫైలు ఆమోదానికి ముందుగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర అటవీ దళాల అధిపతి పంపాలి. అనంతరం ముఖ్య కార్యదర్శి ఈ ఫైలును సంబంధిత మంత్రికి పంపుతారు. మంత్రి అనుమతితో సీఎస్‌కు పంపించి ఉత్తర్వులు జారీచేస్తారు. కానీ, రాష్ట్ర అటవీ అధికారుల నియామకాలకు సంబంధించిన ఫైళ్లను సీఎస్‌కు పంపాల్సిన అవసరంలేదు. మంత్రి అనుమతి తీసుకుని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నేరుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అలాగే, కేడర్ పోస్టుల్లో అఖిల భారత అటవీ అధికారులనే నియమించాలనే నిబంధన ఉంది. ఇందుకు భిన్నంగా.. రాష్ట్ర రోడ్డు రహదారుల అభివృద్ధి సంస్థలో పర్యావరణ అధికారిగా పనిచేస్తున్న షేక్ సలాం అటవీశాఖలో తనకు పోస్టింగ్ ఇవ్వాలని అటవీ దళాల అధిపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ ఫైలును అటవీ దళాల అధిపతి బైపాస్ చేసి మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి పంపకుండా సీఎస్‌కు పంపి బదిలీ ఉత్తర్వులిచ్చారు.