నగదు కష్టాలపై ప్రత్యామ్నాయ చర్యలు
-
ఇన్‌చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు
నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న నగదు కష్టాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు బ్యాంకర్లను ఆదేశించారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీహాల్‌లో బుధవారం బ్యాంకర్లతో పాటు పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య ప్రజలు పడే ఇబ్బందులను గమనించామన్నారు. దీనిపై ఏం చర్యలు చేపట్టారని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావును మంత్రి ప్రశ్నించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో రూ.2,380 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు. అయితే రిజర్వు బ్యాంకు నుంచి కొత్త నోట్లు రూ.930 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. వీటిని అన్ని బ్యాంకులకు పంపామన్నారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం తగిన ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ తీరు పట్ల మంత్రి శిద్ధా రాఘవరావు చర్చించారు. రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయటంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఆన్‌లైన్ విధానం ద్వారా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ హేమామహేశ్వరరావు సమాధానమిచ్చారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సంబంధితశాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ సామాజిక పింఛన్‌దారులకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. చౌకదుకాణాలు, ఎరువుల దుకాణాల్లో ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయశాఖకు సంబంధిత అధికారులతో ప్రతి రోజూ ఆయా మండలాల వారీగా సమీక్షిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ–2 సాల్మన్ రాజ్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసా రత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.