
చిన్నారి ప్రాణం తీసిన విక్స్ డబ్బా
♦ గొంతులో ఇరుక్కోవడంతో
♦ 15 నెలల పాప మృతి
భైంసా: విక్స్‌డబ్బా చిన్నారి ప్రాణం తీసింది. సరదాగా ఆడుకుంటూ నోట్లో పెట్టుకోగా.. మృత్యువులా మారింది. కళ్ల ముందే కూతురు ఊపిరి ఆగుతుండడం చూసి కన్నవారు తల్లడిల్లిపోయూరు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన కారగిరి గణేశ్, వనజ దంపతుల మొదటి సంతానం సాయికృతిక్ష. వనజ తానూరు కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలుగా పనిచేస్తోంది. గణేశ్ పీజీ పూర్తి చేసి గ్రూప్స్ కోసం సిద్ధమవుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరిన దంపతులు భోజనాలు చేశాక మంచంపై 15 నెలల చిన్నారితో ఆడుకుంటూ ఉన్నారు. అక్కడే విక్స్‌డబ్బా కనిపించగా, చిన్నారి తీసుకుని నోట్లో పెట్టుకుంది. సెకన్ల వ్యవధిలో నోట్లో ఉన్న డబ్బా గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. ఆ పక్క నే ఉన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గొంతులో ఇరుక్కుపోయిన డబ్బాను తీసేందుకు యత్నించారు.
హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది గంటలకు భైంసాకు చేరుకునే సరికి చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ‘చేతిలో ఆడుకోవడానికి తీసుకున్న విక్స్‌డబ్బా పాప పాలిట మృత్యువుగా మారుతుం దని ఊహించలేకపోయాం, రోజూ ఇంటికి రాగానే వచ్చీరాని మాటలతో పాప ఎదురు వచ్చేది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిలుస్తారు?’ అంటూ ఆ తల్లిదండ్రులు కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది. బుధవారం ఉదయం మహాగాంలో పాప అంత్యక్రియలు నిర్వహించారు.