అన్ని రంగాల్లో జిల్లాను మెరుగుపరుస్తాం
– ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు
– 70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం కేఈ
– జిల్లాలో 1801లోనే స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభమైందని వెల్లడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్మార్ట్ జిల్లాగా అభివద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకోసం అందరూ కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరుస్తున్నామని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలతో పాలనా వ్యవస్థను వేగవంతం చేస్తున్నామని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రకటించారు. పోలీసు పేరెడ్ గ్రౌండ్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేఈ కృష్ణమూర్తి జెండా ఎగురవేసి ప్రసంగించారు. జిల్లాలో 1801లోనే స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభమయిందని.. ఈ పోరాటంలో తెర్నెకల్లులో ప్రాణాలకు తెగించి పోరాడి అమరుడైన ముత్తుకూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్‌లు మనందరికీ ప్రాతః స్మరణీయులని కొనియాడారు. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు నేడు మన త్రివర్ణ పతాకం ఆనందోత్సవాల మధ్య రెపరెపలాడుతోందన్నారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంలోనే 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం చేసి పునీతులవుతున్నారని తెలిపారు. శ్రీశైలం, సంగమేశ్వరంలో అత్యంత వైభవోపేతంగా పుష్కరాలు జరిగేందుకు అన్ని వసతులు కల్పించామన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని... ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును గని, శకునాలలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. తంగెడంచెలో రూ.240 కోట్లతో మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమకు 211 ఎకరాలు, రూ.2 వేల కోట్ల పెట్టుబడితో జైన్ ఇరిగేష్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు 640 ఎకరాలు కేటాయించామన్నారు. వీటితో పాటు అనేక సిమెంట్ పరిశ్రమలూ ఏర్పాటు కానున్నాయన్నారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రజా ప్రతినిధులు.. సత్వర న్యాయసేవలందిస్తున్న జిల్లా జడ్జి, సహచర జడ్జీలు, కలెక్టర్‌తో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఆహర్నిశలు కృషి చేస్తున్న ఎస్పీ, పోలీసు యంత్రాంగానికి డిప్యూటీ సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
డిప్యూటీ సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
– ఈ ఖరీఫ్‌లో రూ.12.57 కోట్ల సబ్సిడీపై దాదాపు 50వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశాం. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో రూ.939 కోట్లను 4.3లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రెయిన్‌గన్లను కొనుగోలు చేస్తున్నాం.
– సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నీరు–చెట్టు కింద జిల్లాలో 900 చెరువుల్లో పూడికతీత పనులను లక్ష్యంగా పెట్టుకుని కోటి 20 లక్షల క్యూబీక్ మీటర్ల మట్టిని తొలగించాం. గురు రాఘవేంద్ర, చిలకలడోన, దుద్ది, బసలదొడ్డి, మాధవరం ఎత్తిపోతల పథకాల ద్వారా 50 వేల ఎకరాలకు, తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 70 వేల ఎకరాలకు, కేసీ కెనాల్ కింద లక్షా 74 వేల ఎకరాలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 95 వేలు, హంద్రీనీవా కింద 85 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది మొదటిసారిగా గోరుకల్లు రిజర్వాయర్‌లో 7 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం.
– పెట్టుబడి నిధి కింద 4 లక్షల 25 వేల 267 మంది పొదుపు మహిళలకు మూడు వేల చొప్పున రూ.127 కోట్లను మంజూరు చేశాం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1012 సంఘాలకు రూ.29 కోట్లను పంపిణీ చేశాం.
– ఎన్టీఆర్ భరోసా పథకం కింద 3 లక్షల 10 వేల మందికి పింఛన్లు అందిస్తున్నాం.
– కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 కోట్లతో కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించాం. అదేవిధంగా రూ.11 కోట్లతో డయాగ్నస్టిక్ ల్యాబ్ నిర్మాణంతో పాటు రూ.3 కోట్లతో మౌలిక వసతులను కల్పించాం. రూ.120 కోట్లతో ప్రాంతీయ కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తాం.
– ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.12.78 కోట్లతో 3 లక్షల 20 వేల జతల యూనిఫాం పంపిణీ చేశాం. ఎన్టీఆర్ గహ నిర్మాణం కింద 11 వేల 850 గహాలను మంజూరు చేశాం. దీపం పథకం కింద లక్షా 44 వేల గ్యాసు కనెక్షన్లను ఇచ్చాం.
– నగరపాలక సంస్థలో మొత్తం రూ.78.75 లక్షలతో తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, పార్కులను అభివద్ధి చేస్తున్నాం.
– పుష్కరాల్లో రూ.70 కోట్లతో 60 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాం. దేవాదాయశాఖ ద్వారా రూ.3.70 కోట్లతో 22 దేవాలయాలను పునరుద్ధరించాం.
– జిల్లాలో 368 మీసేవా కేంద్రాల ద్వారా భూమి రికార్డులు, కుల, ఆదాయ, నివాస ధవపత్రాలను జారీచేస్తున్నాం. మీకోసం ఫిర్యాదుల ద్వారా 3 లక్షల 47 వేల దరఖాస్తులను స్వీకరించి 3 లక్షల 38 వేల సమస్యలను పరిష్కరించాం.
– ఈ ఆర్థిక సంవత్సరం లక్ష మరుగుదొడ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. 252 గ్రామపంచాయతీలను బహిరంగ మల విసర్జనలేని పంచాయతీలుగా మారుస్తాం.
– సాంఘిక సంక్షేమశాఖ ద్వారా 17 వేల 268 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను విడుదల చేయడంతో పాటు దుల్హన్ పథకం కింద 498 మంది పేద మైనార్టీ యువతుల వివాహానికి రూ.2.49 కోట్లను మంజూరు చేశాం.