- కాకినాడ స్మార్ట్ సిటీలో పడని అభివృద్ధి అడుగులు
- సమస్యలతో సహవాసం చేస్తున్న ప్రజలు
- ప్రతిపాదననలకే పరిమితమైన రూ.1993 కోట్లు
- తొలి విడతగా విడుదలైన రూ. 378 కోట్లు
- నమూనాలు...టెండర్ల దశలోనే పనులు .
స్మార్ట్ ... పిటీ
Published Mon, Jul 17 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
అమరావతి ... రాజధాని ... ప్రపంచంలోనే అత్యద్భుతం ... కళ్ల ముందు ఊహా చిత్రాలు ఓ వైపు రాష్ట్ర ప్రజల ముందు ఒయ్యారాలు ఒలకబోస్తుంటే ... ఇంకోవైపు స్మార్ట్ సీటీల పేరుతో నగర ప్రజలను ఊరిస్తున్నాయి. అదిగో నవలోకం అంటూ రెండేళ్ల నుంచి ఆశలు ఆకాశంలో విహరిస్తున్నా ఆచరణలో మాత్రం చిన్న చిగురు కూడా కనిపించడం లేదేమిటంటూ జనం ప్రశ్నిస్తున్నారు. వందల కోట్ల రూపాయల కుమ్మరింపు సంఖ్యలు పుంఖానుపుంఖాలుగా అధికారులు చెబుతున్నారు గానీ విడుదల్లో ఆ స్పీడు కనిపించకపోవడంతో ఇదేమి ‘స్మార్ట్’రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు నగర వాసులు.
.
ప్రకటన: కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్‌లో...
- నిధుల ఆశల విహారం: రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు.
- విడుదల: దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు...
- హడావుడి ఇలా: స్మార్ట్‌సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు.
- ఎలా అంటే...: రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్‌నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ఊరించారు
- వామ్మో: దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి.
.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది కాకినాడ పరిస్థితి. ప్లానింగ్ సిటీ అని, పెన్షనర్స్ ప్యారడైజ్ అని గొప్పగా చెప్పుకునే కాకినాడ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త ... పట్టణమంతా అపారిశుద్ధ్య పరిస్థితులు... మురుగునీటి ముంపునకు గురవుతున్న కాలనీలు...దోమలతో నరకయాతన...పందుల స్వైర విహారం...చెలరేగిపోతున్న గ్రామ సింహాలు...గోతులమయమైన రోడ్లు...ప్రమాదాలకు గురవుతున్న వాహన చోదకులు... కాకినాడ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలివీ. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. రూ. 1993 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర రాజధాని మాదిరిగా నమూనాలతో ప్రజల్ని ఊహల్లో ఊరేగించారు. కానీ ఇంతవరకూ అభివృద్ధి అడుగులు వేయలేదు. టెండర్ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. కనీసం పారిశుద్ధ్య పరిస్థితుల్ని మెరుగుపర్చలేకపోయారు. ఇప్పుడు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ మాటేమోగానీ దోమలు, పందుల్లేకుండా చెయ్యండి మొర్రో అని పట్టణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా నగరమంతా ఇదే పరిస్థితి నెలకుంది. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం నడియాడే కాకినాడలోనే ఈ పరిస్థితి ఉందంటే జిల్లాలో మిగతాచోట్ల ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చుదిద్దుతామని పాలకులు తెగ ప్రచారమిచ్చారు. ఆచరణలో వారి ఆ పనితనం కనిపించడం లేదు.
.
ఊరింపు ఇలా...
కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్‌లో ప్రకటించారు. రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు విడుదలయ్యాయి. స్మార్ట్‌సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \
రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్‌నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ పేరుతో కాకినాడలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో తొలి విడద అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించారు. దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అభివృద్ధి పనులేవీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పడు అడిగినా టెండర్ల దశలో ఉన్నాయని అధికారులు సెలవిస్తున్నారు. ఈలోపు నగరంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. పరిష్కారం కాదు కదా ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. అపారిశుద్ధ్య పరిస్థితుల మధ్య పెరిగిన దోమలతో ఎటువంటి వ్యాధులు వస్తాయోనన్న భయం ప్రజలకు పట్టుకుంది. ముఖ్యంగా వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన నెలకుంది.
Advertisement
Advertisement