- పైపులైన్ గ్యాస్ మూడు నెలలు ఉచితం
- సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కనెక‌్షన్లు
- తొలి ఐదువేల కనెక‌్షన్లకే ఈ అవకాశం
స్మార్ట్’ ఆఫర్
Published Wed, Jul 19 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
కాకినాడ:
‘జియో’ లాగే ఇప్పుడు ‘గ్యాస్’కు కూడా ఓ ఆఫర్ వచ్చింది. పైపులైన్ గ్యాస్ కనెక‌్షన్ వేయించుకుంటే మూడు నెలలపాటు ఉచితంగా ‘గ్యాస్’ వాడుకునే అవకాశాన్ని భాగ్యనగర్ గ్యాస్ సంస్థ స్మార్ట్ సిటీ కాకినాడ వాసులకు కల్పించింది. ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కనెక‌్షన్ ఇస్తామంటూ ముందుకు రావడంతో ఈ కొత్త ‘ఆఫర్’ అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
స్మార్ట్‌సిటీ కాకినాడలో రామారావుపేట, గాంధీనగర్ ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలోని ప్రతీ ఇంటికి పైపులైన్ గ్యాస్, పైబర్ గ్రిడ్ కనెక‌్షన్, సోలార్ లైట్స్, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ ప్లాంట్‌లు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి అన్ని సదుపాయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇక్కడ విజయం సాధించాక దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన రామారావుపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో 4,700 కనెక‌్షన్లు ఇవ్వాలని అంచనా వేశారు. ప్రధానంగా పైపులైన్ ద్వారా గ్యాస్ వేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ రూ.ఐదువేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ధేశించి, తొలుత రూ.వెయ్యి స్వీకరించి మిగిలిన సొమ్మును ఎనిమిది వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. అయితే ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో కమిషనర్ అలీమ్‌భాషా, డిప్యూటీ కమిషనర్ కె.రమేష్‌కుమార్ భాగ్యనగర్ గ్యాస్ సంస్థతో చర్చలు జరిపారు. చర్చలు అనంతరం తొలి పదివేల కనెక‌్షన్లను ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఇచ్చేలా సంస్థ యాజమాన్యం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మొదటి మూడు నెలలు గ్యాస్‌ను ఉచితంగా అందించేందుకు కూడా సంస్థ అంగీకరించడంతో నగరంలో పెద్ద ఎత్తున పైపులైన్ గ్యాస్ కనెక‌్షన్లు వచ్చే అవకాశం ఉందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు.
.
తొలి దరఖాస్తులకు ప్రాధాన్యం...
సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా మూడు నెలలు ఉచితంగా గ్యాస్ పొందేందుకు తొలుత వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కాకినాడలో 4,800 వరకు దరఖాస్తులు వచ్చినట్టు కార్పొరేషన్ వర్గాల సమాచారం. పదివేల కనెక‌్షన్లు వరకు రాయితీ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వచ్చే 5,200 కనెక‌్షన్లకు ప్రాధాన్యతనిచ్చి ఈ వెసులుబాటును అందివ్వనున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించారు.
.
సద్వినియోగం చేసుకోవాలి...
భాగ్యనగర్ గ్యాస్ సంస్థ మంచి అవకాశం కల్పించింది. దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్‌పీజీ సిలెండర్‌తో పోలిస్తే పైపులైన్ గ్యాస్ ధర తక్కువ, సురక్షితం. వచ్చే డిసెంబర్ చివరినాటికి నగరంలో 20 వేల పైపులైన్ కనెక‌్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
Advertisement
Advertisement