నత్తే నయం..
-
దొరకని పల్స్
-
ముందుకు సాగని ప్రజా సాధికార సర్వే
జిల్లాలో ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నత్తనడకన సాగుతోంది. సర్వేను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదు. సర్వర్, ట్యాబ్‌ల సమస్యలతో సర్వే వేగవంతంగా ముందుకు సాగడంలేదు. సర్వర్ మొరాయించడంతో సిబ్బంది ఆది నుంచి అవస్థలుపడుతున్నారు.
నెల్లూరు(పొగతోట): జిల్లాలో ప్రజా సాధికార సర్వే ప్రారంభించి 10 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు 30 వేల మంది వివరాలు కుడా అప్‌లోడ్ చేయకపోవడం గమనార్హం. ప్రారంభంలో రెండు రోజులు సర్వర్ పని చేయలేదు. సర్వర్ సమస్యను పరిష్కరిస్తే ట్యాబ్‌ల నుంచి సమాచారం అప్‌లోడ్ కాకా మరో రెండు రోజులు ఇబ్బందులుపడ్డారు. ఈ రోజుకు కూడా పల్స్ సర్వే సమస్యలతో నిదానంగా సాగుతుంది. ఈ నెల 31వ తేదీలోపు మొదటి విడత సర్వే పూర్తి చేయాల్సి ఉంది.
జిల్లాలో 940 పంచాయతీలు
జిల్లాలో 940 పంచాయతీలున్నాయి. సుమారు 30 లక్షల మంది జనాభా ఉన్నారు. 8.60 లక్షల కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో 6500, అర్బన్‌లో 1200 కుటుంబాలకు సంబంధించిన వివరాలు మాత్రమే సేకరించారు. ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా సాధికార సర్వే నిర్వహించి ప్రజల పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభించారు. సర్వే చేసేందుకు 1452 మంది ఎన్యూమరేటర్లు, 1452 మంది అసిస్టెంట్లను నియమించారు. సర్వేను పర్యవేక్షించేందుకు 400 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలు సేకరించి ట్యాబ్‌లలో అప్‌డేట్ చేయడం ప్రాంభించారు.
ట్యాబ్‌లలో తప్పులొస్తున్నాయి
ప్రజల నుంచి వివరాలు సేకరించి ట్యాబ్‌లలో అప్‌డేట్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల పురుషుడికి బదులు స్త్రీగా నమోదవుతోంది. ద్విచక్ర వాహనం ఉందని ట్యాబ్‌లో నమోదు చేస్తే లేదని చూపిస్తోంది. పేర్లు, అడ్రసు నమోదులో తప్పులు వస్తున్నాయి. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయని నమోదు చేస్తే లేనట్లు నమోదవుతున్నాయి. వాటిని సరి చేయడానికి జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల సమయం పట్టింది. ట్యాబ్‌లు సక్రమంగా పని చేయక ఎన్యూమరేటర్లు ఇబ్బందులుపడుతున్నారు. కొన్ని చోట్ల కుటుంబంలో సభ్యులందరూ అందుబాటులో లేకపోవడంతో సర్వే ముందుకు సాగడంలేదు. ట్యాబలలో నూతన యాప్ అప్‌గ్రేడ్ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సక్రమంగా అందక సిబ్బంది అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో అనుకున్న సమయానికి మొదటి విడత సర్వే పూర్తయ్యే విషయం అనుమానంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నట్లు సర్వే కొనసాగితే పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు.
సర్వర్ లోపాలను సవరించాం: మహమ్మద్ ఇంతియాజ్, జేసీ
ప్రజా సాధికార సర్వే వేగవంతంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. సర్వర్ లోపాలను సవరించాం. నూతన సర్వర్ ఏర్పాటు చేశాం. ట్యాబుల్లో పేర్లు మార్పు తదితర సమస్యలు పరిష్కరించాం. సర్వే వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.