పల్స్ సర్వేపై అసంతృప్తి
-
సమస్యలు పరిష్కరించడంలేదని బాయ్‌కాట్
నెల్లూరు సిటీ : పల్స్ సర్వేలో ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని, సర్వే ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్యూమరేటర్లతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ గిరిజలు సమావేశం నిర్వహించారు. కొందరు ఎన్యూమరేటర్లు ఫీల్డ్‌లో ఎదురవుతున్న సమస్యలను వారికి చెప్పారు. అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో ఎన్యూమనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. సర్వేకి వెళ్లిన సమయంలో సంబంధిత కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, పత్రాలు సరిగా లేకపోవడంతో ఆలస్యమవుతుందన్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఒత్తిళ్లు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.