స్మార్ట్‌గా ...సులభంగా! | smart yaps, cse, students | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా ...సులభంగా!

Published Fri, Jul 29 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

స్మార్ట్‌గా ...సులభంగా!

స్మార్ట్‌గా ...సులభంగా!

– అరచేతిలో సమస్త సమాచారం
– అన్నమాచార్య కళాశాల విద్యార్థుల నూతన ఆవిష్కరణ


తిరుపతి ఎడ్యుకేషన్‌ : వారంతా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) చదువుకుంటున్న విద్యార్థులు. ఓ వైపు చదువుకుంటూనే తమ వంతు ప్రజలకు ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి నడుం బిగించారు. చదువుకు సృజనాత్మకతను జోడించి పలు స్మార్ట్‌ యాప్స్‌(అప్లికేషన్స్‌)ను రూపొందించారు. అన్నదాతకు సమస్త సమాచారం అందించే ‘అగ్రికల్చర్‌’, తిరుపతికి వచ్చే భక్తులు, యాత్రికులకు అవసరమైన విషయాల కోసం ‘తిరుపతి యాత్ర’, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘డ్రైవింగ్‌ మోడ్‌’, మహిళలకు భద్రతకు ‘ఉమెన్స్‌ సెక్యూరిటీ’, షాపింగ్‌ మరింత సులభంగా చేయడానికి ‘షాప్‌ హియర్‌’, ‘బాజే’ అప్లికేషన్లు తదితరాలను రూపొందించి ప్రశంసలందుకున్నారు. స్మార్ట్‌గా.. సులభంగా సమాచారం తెలుసుకునేందుకు అనంతపురం జేఎన్‌టీయూ వర్సిటీ పరిధిలోని కళాశాలలు, ఇతర వివరాలకు సంబంధించి ‘జేఎన్‌టీయూఏ సిలబస్‌’ను యాప్‌ను సృష్టించారు.  

స్కిల్‌ ఇండియా పిలుపుతో..
ప్రధాని నరేంద్రమోది స్కిల్‌ ఇండియా పిలుపుతో తిరుపతి–కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల సీఎస్‌ఈ విభాగపు తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ అప్లికేషన్లు రూపొందించారు. మిట్‌ టూల్‌ సహాయంతో ఈ యాప్స్‌ను సృష్టించారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ కళాశాల చైర్మన్‌lగంగిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ యల్లారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.నాదమునిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ యాప్స్‌కు సంబంధించిన వివరాలు, వాటి ఉపయోగాలు విద్యార్థుల మాటల్లోనే...

అన్నదాతల కోసం ‘అగ్రికల్చర్‌’
ఈ యాప్‌ను వరదన్, శ్రీనివాస్‌ రూపొందించారు. ఇందులో వాతావరణానికి తగిన పంటలు, పెట్టుబడులు, రాబడులు, రసాయనాలు, పాడి పంట తదితర విషయాలను నిక్షిప్తం చేశారు. సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో దీన్ని రూపొందించారు. ఈ యాప్‌ను స్మార్ట్‌ ఫోనులోకి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్నెట్‌ సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

భక్తుల కోసం‘తిరుపతి యాత్ర’
 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం రోజూ వేల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తిరుపతికి వస్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని నితిన్‌తేజ, ప్రవీణ్‌ ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో భక్తులకు కావాల్సిన తిరుమల శ్రీవారి దర్శనం, గదులు తదితర వివరాలు ఉంటాయి. తిరుపతి మ్యాప్, ముఖ్యప్రదేశాలు, హోటల్స్, ట్రావెల్స్‌ వివరాలను పొందుపరిచారు. తిరుపతి సరిసరాల్లోని పుణ్యక్షేత్రాల సమాచారం కూడా ఇందులో ఉంటుంది.

 రోడ్డు ప్రమాదాల నివారణకు ‘డ్రైవింగ్‌ మోడ్‌’
ప్రస్తుతం సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.  దీన్ని నివారించేందుకే ‘డ్రైవింగ్‌ మోడ్‌’ యాప్‌కు చరిష్మ, దివ్య ప్రాణం పోశారు. ఈ యాప్‌ ఉంటే వాహనం నడిపేటప్పుడు ఫోన్‌ చేసే అవతలి వారికి మనము డ్రైవింగ్‌లో ఉన్నామనే విషయాన్ని చేరవేస్తుంది.

మహిళల కోసం‘ఉమెన్స్‌ సెక్యూరిటీ’
మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సౌందర్య, శ్రీలక్ష్మి ‘ఉమెన్స్‌ సెక్యూరిటీ’ యాప్‌కు శ్రీకారం చుట్టారు. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక బటన్‌ సహాయంతో తాము ఏ పరిస్థితిలో ఉన్నామో సమీప పోలీస్‌స్టేషన్లోని షీ టీమ్‌కు చేరేలా ఈ యాప్‌ రూపొందించారు. అవసరమైతే మహిళలకు ఈ యాప్‌ను ఉచితంగా ఇస్తామని వారు ముందుకొచ్చారు

 ‘షాప్‌ హియర్‌ ’తో మరింత సులభంగా..
ఆధునిక కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌కే అందరూ మక్కువ చూపుతున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మరింత సులభంగా ఉండేలా ప్రత్యేకంగా ‘షాపింగ్‌ హియర్‌’ అనే యాప్‌ను రూపొందించారు ఎ.హర్షిత, ఆర్‌.జ్ఞాన దీపిక. ఈ యాప్‌లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని రకాల వస్తువులను చూడొచ్చు, నచ్చితే కొనుగోలు చేయవచ్చు.

మరిచిపోకుండా ‘బాజే’
 ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నచిన్న విషయాలను కూడా మరిచిపోతుంటాం. ముఖ్యంగా షాపింగ్‌ చేసేటప్పుడు మతిమరుతపుతో పలుమార్లు షాపింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే లహరి, దేవిశ్రీ ‘బాజే’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ సహాయంతో షాపింగ్‌ సమయంలో మనకు కావాల్సిన అన్ని వస్తువులను మరచిపోకుండా కొనుక్కోవచ్చు.

విద్యార్థులకు ఉపయోగపడే ‘జేఎన్‌టీయూఏ సిలబస్‌’
విద్యార్థులు, ముఖ్యంగా అనంతపురం జేఎన్‌టీయూ వర్సిటీ పరిధిలోని కాలేజీలు ఇతర వివరాలు తెలుసుకునేందుకువీలుగా అనీష, కుసుమ ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు, సిలబస్, వీడియోస్, నోట్స్, సాంకేతిక నిపుణుల సమాచారం పొందుపరిచారు. సెమిస్టర్లు, బ్రాంచ్‌ల వారీగా సమాచారాన్ని సులభంగా, ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement