సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం | social benefit is aim of literature | Sakshi
Sakshi News home page

సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం

Published Sat, Apr 8 2017 9:15 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం - Sakshi

సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం

- ప్రపంచీకరణతో మానవీయ సంబంధాలు విధ్వంసం
- సీమ, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై కథలు అవసరం
- డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ 
 
కర్నూలు(కల్చరల్‌): సమాజం నుంచే సాహిత్యం పుట్టుకొస్తుందని, సామాజిక ప్రయోజనమే సాహిత్యం ప్రధాన లక్ష్యం కావాలని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అన్నారు. లలిత కళాసమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరుగుతున్న రచయితల మహాసభల రెండో రోజు శనివారం ఆయన ‘తెలుగు కథా పరిణామం’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరువు కాలంలో బయట నదులు ఎండిపోతున్నాయి.. లోపల గుండెల్లోని నదులు కూడా ఎండిపోతున్నాయన్నారు. బయట ఎండిపోతున్న నదులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయేమో కానీ.. గుండె లోపలి దయ, కరుణ, జాలి, మానవత్వం అనే నదులు ఎండిపోతే ఇక ప్రత్యామ్నాయం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
 
గతంలో మానవీయ విలువలు కల్గిన సాహితీ సృజన జరిగిందన్నారు. ప్రస్తుతం వ్యక్తిత్వ ప్రధానమైన అంశాలు, వ్యక్తి కేంద్రిత ప్రభావం సాహిత్యంలో పెరిగిపోతుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వృత్తుల ధ్వంసం, మానవీయ సంబంధాల విధ్వంసంపై చాలా కథలు వచ్చాయన్నారు. సమాచార విప్లవం ద్వారా రిలయన్స్‌ రిలేషన్స్‌ పెరిగిపోతున్నాయి కానీ రియల్‌ రిలేషన్స్‌ తరిగిపోతున్నాయన్నారు. ఇంకా ప్రపంచీకరణ వికృత పరిణామాలపై కథలు రాయాల్సిన అవసరముందన్నారు. రాయలసీమ నుండి కరువు, వలసలు, ముఠాకక్షల ఇతివృత్తంతో  చాలా కథలు వచ్చాయన్నారు. అయితే విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కథలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  
 
  • కర్నూలు జిల్లా రచయిత జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ లలిత కళాసమితి రచయితల మహాసభలు నిర్వహిస్తూ సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశాలలో అనుభవజ్ఞులైన నిపుణులైన మేధావులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 
 
  • ‘స్త్రీవాద సాహిత్యం, సమాలోచనం’ అనే అంశంపై హైదరబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్‌ శరత్‌ జ్యోత్స్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీవాద రచయిత్రులు చాలా విప్లవాత్మకమైన అంశాలను సాహిత్యంలోనికి తీసుకొచ్చారన్నారు. స్త్రీ స్వేచ్ఛ గురించి చలం అనేక కథలు రాశారన్నారు. ఓల్గా రాజకీయ కథలు, పి.సత్యవతి కథలు, రంగనాయకమ్మ నవలలు, పురుషాధిక్య సమాజంపై అనేక వ్యంగ్యాస్త్రాలను విసిరాయన్నారు. అలనాటి సాంప్రదాయ సాహిత్యంలోనూ స్త్రీలు స్వేచ్ఛను కాంక్షించే విధంగా రచనలు చేశారన్నారు. 
  • తిరుపతి పద్మావతి యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్‌ రాజేశ్వరమ్మ మాట్లాడుతూ స్త్రీవాద సాహిత్యంలో వచ్చిన కవిత్వం పురుషాధిపత్యాన్ని ధీటుగా ప్రశ్నించిందన్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీలను వివక్షకు గురిచేస్తున్న పురుషాధిక్య సమాజంపై స్త్రీ వాదం తిరుగుబాటు చేసిందన్నారు. ఇంకా పదునైన కథలు, కవిత్వం రచించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రచయిత్రులు దండెబోయిన పార్వతి, కళ్యాణదుర్గం స్వర్ణలత స్త్రీవాద సాహిత్య ప్రయోజనాలను వివరించారు.
  •  ప్రముఖ కళాకారుడు, ప్రజానాట్యమండలి మాజీ అధ్యక్షుడు శాంతారామ్‌ మాట్లాడుతూ ఉత్తమ సాహిత్య సృజనకు విమర్శ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. 
  •  అనంతపురం వాస్తవ్యులు, సుప్రసిద్ధ కథా రచయిత బండి నారాయణస్వామి రాయలసీమలో వర్ధమాన కథకుల రచనల గురించి ప్రసంగించారు. రాయలసీమ నుంచి ఇటీవల కాలంలో పదునైన కథలు పుట్టుకొచ్చాయన్నారు. విభజన నేపథ్యంలో అన్ని రంగాలలో రాయలసీమ ఎదుర్కొంటున్న వివక్షను, సీమలోని వెనుకబాటుతనాన్ని సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపించేటట్లు చేయాలన్నారు. ఏ ఉద్యమానికైనా ఊతంగా నిలిచేది కళలు, సాహిత్యమేనన్నారు. రాయలసీమలో కథకు, కవులకు, కళాకారులకు కొదువ లేకున్నా బలమైన సాహిత్యం ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఇంకా ఉందన్నారు.  
  •   అనంతరం జరిగిన కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. కార్యక్రమంలో లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, మహాసభల కన్వీనర్‌ ఇనాయతుల్లా, కో–కన్వీనర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్, ఆహ్వానసంఘం సభ్యులు మహమ్మద్‌ మియా, కెంగార మోహన్, డాక్టర్‌ జయరాం, ఎస్‌.డి.వి.అజీజ్, మధుసూదనాచార్యులు, కె.ఎన్‌.మద్దిలేటి, లలిత కళాసమితి కార్యవర్గ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, సంగా ఆంజనేయులు పాల్గొన్నారు.  
 
విమర్శ ఉంటేనే సాహిత్యం సుసంపన్నం : తెలకపల్లి రవి 
సద్విమర్శ ఉంటేనే సాహిత్యం సుసంపన్నం అవుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహిత్య విమర్శకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు.   ప్రగతి శీల సాహితీ సృజన వైపు సాహిత్య విమర్శ ప్రోత్సహించాలన్నారు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు విమర్శనాత్మక దృష్టితోనే సాహితీ సృజన చేశారన్నారు. ప్రస్తుతం సినిమాలలో, పత్రికల్లో వస్తున్న సాహిత్యం పట్ల పదునైన విమర్శ లేకపోవడం చేతనే ప్రమాదకరమైన సాహితీ సృజన జరుగుతుందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement