విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొల్లూరి చిరంజీవి
పంజగుట్ట: తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే తెలంగాణ విమోచన దినం అని వాదనలు వినిపిస్తున్నారని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ విలీనం కాదు, విమోచన దినం కాదని వారు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య కో కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి, కన్వీనర్ ఆరీఫుద్దీన్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంతో ఏదైనా విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కాని హైదరాబాద్ చరిత్ర వక్రీకరించకూడదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హితవుపలికారు. ప్రొఫెసర్ కోదండరామ్ విలీనదినమని అంటున్నారని దాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. లైబ్రరీలో ఎన్నో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ సత్తార్ ముజాహిద్, శ్రీరామ్, ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.