సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో తెలంగాణలోని నర్సాపూర్ టౌన్, మహబూబ్‌నగర్‌తో పాటు ఏపీలోని విజయవాడ, కాకినాడను సోలార్ సిటీలుగా మార్చాలని నిర్ణయించినట్టు కేంద్ర వెల్లడించింది. ఈ మేరకు ఎంపీలు బుట్టా రేణుక, మాల్యాద్రి శ్రీరామ్ గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని ఎన్పీ కుంట మండలంలో, కడప జిల్లాలోని గాలివీడు మండలంలో స్థలాలు గుర్తించామని, అలాగే 1,000 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు కడప జిల్లాలోని మైలవరం, కర్నూలు జిల్లాలో స్థలాలు గుర్తించామని, అదేవిధంగా 500 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. వీటి ఏర్పాటుకు కేంద్ర సాయంగా రూ. 243 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 2015–16 ఏడాదికిగానూ 402 మిలియన్ యూనిట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికిగానూ సెప్టెంబర్ వరకు 458 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు తెలిపారు.