తిరుచానూరు(చిత్తూరు జిల్లా): ‘‘చెల్లి, నాన్న నన్ను వదిలి ఎప్పుడో వెళ్లిపోయారు. నాకంటూ ఉన్న ఏకైక బంధం అమ్మ. అనారోగ్యంతో అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్లి పోయింది. ఇక నాకు ఈ లోకంతో పనిలేదు. అందుకే నేను కూడా మా అమ్మ, నాన్న, చెల్లి వెళ్లిన చోటకే వెళ్లిపోతున్నాను’’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్‌నగర్‌లో వెలుగుచూసింది.
లింగేశ్వర్ నగర్‌కు చెందిన పుష్కరనాథ్ (30) అమ్మ అనురాగం, నాన్న ప్రేమ, చెల్లెలి వాత్సల్యంతో సంతోషంగా జీవించేవాడు. ఏడేళ్ల క్రితం నాన్న, చెల్లెలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత పుష్కరనాథ్ ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లి మునిరాజమ్మ(54)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిని ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఇంటికి తీసుకొచ్చి మందు బిళ్లలు వేయించి పడుకోబెట్టాడు. కాసేపటికే మెలికలు తిరుగుతూ మునిరాజమ్మ మృతి చెందింది. దీంతో మనస్తాపం చెందిన పుష్కరనాథ్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని చనిపోయాడు.
తన ఎస్‌బీఐ ఖాతాలో రూ.16 వేలు ఉన్నాయని తెలిపాడు. తాను పని చేస్తున్న సంస్థ బీరువాలో ఏటీఎం కార్డు ఉందని, ఆ కార్డు ద్వారా రూ.16 వేలు తీసి అంత్యక్రియలకు వినియోగించాలని అందులో పేర్కొన్నాడు. తన ఆఫీసు తాళాలను సైతం యాజమాన్యానికి అందజేయాలని పేర్కొన్నాడు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో బుధవారం రాత్రి తిరుచానూరు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. తిరుపతి ఈస్టు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సురేంద్రనాయుడు, ఎస్‌ఐ చిరంజీవీ సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా తల్లి మృతితో మనస్తాపం చెంది పుష్కరనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.