మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని...
♦ తండ్రిని హతమార్చిన కొడుకు
♦ కర్రలతో కొట్టి చంపిన పుత్రరత్నం
♦ పేట మండలం మక్తలక్ష్మాపూర్‌లో ఘటన
♦ పరారీలో నిందితుడు
సాక్షి, సంగారెడ్డి: మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని మద్య మత్తులో ఓ కొడుకు అతి కిరాతకంగా తండ్రిని కర్రలతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేట మండలం మక్తలక్ష్మాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట సీఐ వెంకటయ్య కథనం ప్రకారం గ్రామానికి చెందిన గొండ్లె ఆగమయ్య(65)కు భార్య పెంటమ్మ, ఇద్దరు కుమారులు సాయిలు, రాములు ఉన్నారు. గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పెద్ద కుమారుడు సాయిలు వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
చిన్న కుమారుడు రాములు దొంగతనాలకు, చెడు వ్యసనాలకు బానిసై రెండు నెలల క్రితం బైక్, ఆటో దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. రాములుకు పెళ్లైంది కానీ ప్రస్తుతం భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన రాములు తన తండ్రికి వచ్చిన ఆసరా పింఛన్ డబ్బుల నుంచి మద్యం సేవించడానికి డబ్బులు ఇమ్మని అడుగగా అతడు నిరాకరించాడు. మృతుడి భార్య పెంటమ్మ రూ.300 ఇచ్చింది. దీంతో తాగి వచ్చిన రాములు తండ్రి ఆగమయ్యను డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టి హతమార్చాడు.
గొడవ జరుగుతున్న సమయంలో తల్లి పెంటమ్మ భయంతో బయటకు వెళ్లి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారందరూ వచ్చే సరికే తండ్రిని దారుణంగా హతమార్చిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీధర్, ట్రైనీ ఎస్‌ఐ కోటేష్ విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.