అవినీతికి పాల్పడితే చర్యలు
కడప అర్బన్ : జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న ఎస్‌ఐ, సీఐ, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో క్రైం సమీక్షను ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ మట్కా, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాల్లో నేరస్తులతో సంబంధాలు పెట్టుకుని కొందరు పోలీసులు మామూళ్లు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు తన దష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇక మీదట అవినీతికి పాల్పడితే కొరడా ఝళిపిస్తామన్నారు. అప్రమత్తంగా పని చేయాల్సిందేనన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు సరైన న్యాయం చేసినపుడే ప్రజల్లో పోలీసులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. నేరాలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. చోరీలు, ఇతర కేసుల్లో త్వరగా రికవరీ చూపించాలన్నారు. రానున్న వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్బాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు ఈజీ అశోక్‌కుమార్, పూజిత నీలం, రామకష్ణయ్య, సర్కార్, రాజేంద్ర, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు సుధాకర్, షౌకత్ అలీ, సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మహిళా పీఎస్ డీఎస్పీ వాసుదేవన్, ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు