కిట్టుగాడు వైజాగ్ లోకల్ | special chit chat with hero rajtarun | Sakshi
Sakshi News home page

కిట్టుగాడు వైజాగ్ లోకల్

Published Sat, Mar 11 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

కిట్టుగాడు వైజాగ్  లోకల్

కిట్టుగాడు వైజాగ్ లోకల్

హీరో కావడానికి ఎలాంటి కిటుకూ లేదు
‘షార్ట్‌’కట్‌లో హీరో అయిపోయాను షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్‌ కోసం విశాఖ అంతా తిరిగేవాణ్ణి
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, రైటర్‌గా రాణించా
ఈ ఏడాది మరో నాలుగు చిత్రాలు
‘సాక్షి’తో యువ హీరో రాజ్‌తరుణ్‌


హీరో అవుతానని కలలోకూడా అనుకోలేదు. ఇంటర్‌పూర్తి చేసి బీటెక్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ చదువులు తలకెక్కలేదు. నా బుర్రలో మెదులుతున్న ఆలోచనలకు దృశ్యరూపం ఇవ్వాలన్నదే టార్గెట్‌. ఇదే విషయం నాన్నకు చెప్పా.. అంతే తను కాదకుండా నా చేతిలో బుల్లి కెమేరాకొని పెట్టారు. నన్నునేను ప్రూవ్‌ చేసుకోవడానికి షార్ట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో దిగాను. వాటి టేకింగ్‌కు మంచి లైక్‌లు రావడంతో ఉత్సాహం ఉరకలేసింది. తెల్లారిందే చాలు కెమేరాతో సిటీ అంతా చుట్టేయడం, యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా షార్ట్‌ఫిల్మ్‌లు తీసేయడం ప్రారంభించా. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఫేస్‌బుక్‌ రూపంలో వెండితెరపై అవకాశం ఆఘమేఘాలపై బుల్లి సందేశం అందింది. సీన్‌కట్‌ చేస్తే వైజాగ్‌ కిట్టుగాడు వెండి తెరపై హీరో అయిపోయాడు. అంటూ తన సినీ రంగప్రవేశానికి సంబం«ధించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు మన విశాఖ కుర్రోడు, యువ హీరో రాజ్‌తరుణ్‌. ఎంవీపీకాలనీలోని సెవెన్‌ బిరియాని రెస్టారెంట్‌లో సాక్షితో కాసేపు మాట్లాడారు. ఇంకా ఏం చెప్పాడంటే...

పెదవాల్తేరు : నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్‌లోనే. వైజాగే ప్రపంచం అన్నట్టుగా పెరిగాను. సెయింట్‌ థెరిసా స్కూల్‌ స్కూలింగ్‌ పూర్తి చేసి, భాష్యంలో తొమ్మిది, పదో తరగతి చదివా. తర్వాత ఇంటర్‌ పూర్తి చేశాను. సాంకేతిక ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ జాయిన్‌ అయ్యాను. మూడునెలలవుతున్నా నాకు బీటెక్‌ కంటే.. కట్‌ స్టార్ట్‌ కెమేరా అనే మాటలు పదే పదే మన మనసును డిస్టబ్‌ చేశాయి. అదే విషయం నాన్నకు చెప్పాను.అంతే ఆయన బుల్లి కెమేరా ఇచ్చారు. అక్కడి నుంచి అదే దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టా.

డాపెడా షార్ట్‌ఫిల్మ్‌ తీసేశా
యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యే చిన్న కథాంశాన్ని స్వయంగానే రాసుకునేవాణ్ణి. దానికి సూట్‌ అయ్యే లోకేçషన్ల కోసం ఊరూరా తిరిగేవాడ్ని. లొకేషన్‌ నచ్చిన వెంటనే ఫిల్మ్‌ మేకింగ్‌కు రెడీ అయ్యేవాళ్లం. అలా నేను వైజాగ్‌లో తిరగని ప్లేసేలేదు.

అప్‌లోడ్‌ చేస్తే చాలు.. లైక్‌లే లైక్‌లు
మేం తీసిన షార్ట్‌ఫిల్మ్‌ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ కోసం చాలా మంది యూత్‌ వేచి చూసేవారంటే నమ్మండి. మేం ఏ సబ్జెక్ట్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీసినా మంచి రెస్పాన్స్‌ వచ్చేది. 54లు షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేనంటే నమ్మండి..

మేఘసందేశం ద్వారా వెండితెరకు అవకాశం
షార్ట్‌ఫిల్మ్‌లు తప్ప వేరే ధ్యాసలేదు. ఫేస్‌బుక్‌లో ఒక సందేశం నన్ను ఆశ్చర్యానికి లోను చేసింది. మేఘసందేశం షార్ట్‌ఫిల్మ్‌ చూసి ప్రముఖ నిర్మాత రామ్మోహన్‌గారి నుంచి అభినందనలతో పాటు హైదరాబాద్‌ రమ్మని మెసేజ్‌ వచ్చింది. అది చూసి ఒక్కసారి షాక్‌ అయ్యాను.  

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం
హైదరాబాద్‌ వెళ్లి నిర్మాత రామ్మోహన్‌రావు గార్ని కలిస్తే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరమన్నారు. ఇలా ఆయన నిర్మాతగా తీసే సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తుండగానే, అసోసియేట్‌ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు. అక్కడి నుంచి రైటర్‌గా కూడా స్క్రీన్‌ప్లే రాయమన్నారు.

షార్ట్‌కట్‌లో హీరో అయ్యాను
అసోసియేట్‌ డైరెక్టర్‌గా కొత్త సినిమాకు ఆడిషన్స్‌ చేస్తున్నాం. ఆ సినిమాకు హీరో కోసం ఎంపిక జరుగుతుంది. అదే తరుణంలో 30 మంది వరకు ఆడిషన్స్‌ నిర్వహించాం. ఇంతలో నేను కూడా అనుకోకుండా ఆడిషన్స్‌ పాల్గొనాల్సి వచ్చింది. అదృష్టం వరించి హీరోగా ఎంపికయ్యాను. అదే ఉయ్యాల జంపాల సినిమా.

ఈ ఏడాది మరో నాలుగు సినిమాలు
కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేయనున్నాను. ఇందులో అన్నపూర్ణ బేనర్‌లో ఒక సినిమా ఉంది. వీటిలో అంధగాడు, రాజుగాడు మరో రెండు సినిమాలు టైటిల్‌ ఖరారు కావాల్సింది. రామ్‌గోపాలవర్మతో సినిమా వాయిదా పడింది. కథ కనెక్ట్‌ కాగానే వర్మగారితో సినిమా వుంటుంది.

థియేటర్లలో నవ్వులే నవ్వులు
కిట్టు ఉన్నాడు జాగ్రత్త థియేటర్లలో నవ్వులు పూయిస్తోందని, సినిమాకు వెళ్లిన వారంతా హాయిగా నవ్వుకుని విజయవంతం చేశారని ఆ చిత్ర కథానాయుడు రాజ్‌తరుణ్‌ పేర్కొనారు. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్‌ బృందం ఎంవీపీకాలనీలోని ఓ రెస్టారెంట్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్న కథాంశంతో తెరకెక్కిన  ఈచిత్రం యూత్‌కు బాగా కనెక్ట్‌ అయిందన్నారు.

చిత్ర డైరెక్టర్‌ వంశీకృష్ణ మాట్లాడుతూ కుక్కని కిడ్నాప్‌ చేయడం అనే కథాంశంతో హాస్యాన్ని ప్రధానాంశంగా ఈచిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ప్రముఖ నటి సిగ్ధా మాట్లాడుతూ చిత్రం చిత్రీకరణంలోనే ఈ సినిమా ఎంత కామెడీగా ఉంటుందో అర్థమయిందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిలక్ష్మి ఫిలిమ్స్‌ అధినేత బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement