నెల రోజుల్లోగా కనీసం ఐదు వేల హెక్టార్లకు స్ప్రింక్లర్లు (తుంపర) సెట్లు ఇవ్వడానికి వీలుగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు, డీడీలు సేకరించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు.
అనంతపురం అగ్రికల్చర్ : నెల రోజుల్లోగా కనీసం ఐదు వేల హెక్టార్లకు స్ప్రింక్లర్లు (తుంపర) సెట్లు ఇవ్వడానికి వీలుగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు, డీడీలు సేకరించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో శనివారం ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఈ ఇంజనీర్లు, ఎంఐఏవోలు, కంపెనీ డీసీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ కాలువ పరివాహక ప్రాంతాల్లో నీటి వసతి కలిగిన రైతులకు తక్షణం 50 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు సెట్లు అందజేస్తామన్నారు.
ప్రధానంగా ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు తదితర నియోజక వర్గాల పరిధిలో హంద్రీ–నీవా కాలువలకు నీళ్లు వదలడంతో స్ప్రింక్లర్లు సెట్లు ఉపయోగపడుతాయన్నారు. రైతులు తమ వాటాగా రూ.9,850 డీడీ రూపేణా చెల్లిస్తే 25 పైపులు, ఐదు గన్స్ ఇస్తామన్నారు. డీడీ కట్టిన ఐదు రోజుల్లోగా పొలాల్లో బిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 17,071 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు ఇచ్చామన్నారు. మంజూరైన రైతులకు పది రోజుల్లోపు వంద శాతం యూనిట్లు అమర్చి ట్రయల్‌రన్ నిర్వహించాలని ఆదేశించారు. బిజినెస్ ఆఫ్ క్వాంటిటీ (బీవోక్యూ) పూర్తయిన దరఖాస్తులకు సంబంధించి రైతుల చేత డీడీలు కట్టించాలన్నారు.
సెల్ ద్వారా సమాచారం ఇస్తే సరిపోదని, రైతులను కలిసి విషయం చెప్పి డీడీలు కట్టించాలన్నారు. లేదంటే రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రిప్ నిర్వహణ, ఫర్టిగేషన్ తదితర అంశాల గురించి రైతులకు విస్తృత ప్రచారం కల్పించి ప్రోత్సహించడానికి వీలుగా ప్రతి పంచాయతీకి ఒక ఉద్యాన రైతును ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడానికి వారంలోగా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామంలోని మిగతా రైతులకు అవగాహన కల్పించే ఆసక్తి, సేవాతత్పరత కలిగిన మంచి రైతును ఎంపిక చేసి వారి పేర్లు, ఫోన్ నెంబర్లు వారంలోగా అందజేయాలన్నారు. ఎంపీఈఓలను అనుసంధం చేసి క్షేత్రస్థాయిలో ఉద్యాన రైతులకు మెరుగైన సేవలు అందజేయడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు.