- రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం
- రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
దసరాకు స్పోర్ట్స్ అకాడమీలు సిద్ధం
Published Thu, Sep 15 2016 8:51 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో దసరాకు స్పోర్ట్స్ అకాడమీలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, కడప స్పోర్ట్స్ స్కూళ్లలో సింథటిక్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో రాయపాటి లీలా కూమారి స్మారక 3వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభించిన ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ప్రతిభ ఉంటేనే చాలదని ప్రదర్శించే నైపుణ్యతను అలవరుచుకోవాలని సూచించారు. క్రీడాకారులు ఏకాగ్రత కోసం చేయాల్సిన అభ్యాసాన్ని సాధన చేయాలన్నారు. రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని సిద్ధం చేస్తున్నామని, ఇది క్రీడాకారులకు మంచి ట్రాక్‌లా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక స్టయిఫండ్ అందజేయనున్న ఆర్‌ఆర్ స్పోర్ట్స్ అధినేత జి.ప్రసన్న కుమార్‌ను, అథ్లెటిక్స్‌ను ముందుకు తీసుకెళుతున్న అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆర్‌ఆర్ స్పోర్ట్స్, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ చేసుకున్న ఒడంబడిక పత్రాలను ఎల్వీ ప్రసాద్ సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. పోటీలను ముఖ్యఅతిథి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, జిల్లా అథ్లెట్ జ్యోతికాశ్రీ క్రీడా ప్రతిజ్ఞ చేసింది. ఎంకే బేగ్ మునిసిపల్ స్కూల్, వీఎం రంగా మునిసిపల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. వీటితో పాటు గన్నవరం సెయింట్ జాన్స్ స్కూల్ బ్యాండ్ ట్రూపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథుల మన్ననలు పొందింది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ గౌరవ అతిథిగా పాల్గొనగా, శాప్ ఓఎస్‌డీ పి.రామకష్ణ, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రాఘవేంద్రరావు, జిల్లా అధ్యక్షుడు రమేష్‌జైన్, కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, మాజీ డీఎస్‌డీవో బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement