అవినీతి జట్టుకు శ్రీధర్ బిగ్‌బాస్
– మేయర్‌కు కౌన్సిల్ నిర్వహించే అర్హతలేదు
– బిల్లులు పాస్ చేయించుకొనేందుకే కౌన్సిల్
– వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల ధ్వజం
విజయవాడ సెంట్రల్ :
అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌కు కౌన్సిల్ నిర్వహించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆమె శనివారం తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. కౌన్సిల్‌లో అవినీతి జట్టుకు మేయర్ బిగ్‌బాస్ అని ఆరోపించారు. మేయర్ పదవిని అడ్డుపెట్టుకొని కేఎంకే సంస్థకు కాంట్రాక్ట్‌లను దోచిపెడితే, ఎనిమిది మంది కార్పొరేటర్లు బినామీ పేర్లతో కాంట్రాక్ట్‌లను చేశారన్నారు. ఆ బిల్లులను పాస్ చేయించుకోవడం కోసమే హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోని టీడీపీ పాలకులు.. తమ సొంత ప్రయోజనాల కోసం మరోసారి కౌన్సిల్‌ను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేయర్ అధికార దుర్వినియోగంపై కమిషనర్ జి.వీరపాండియన్‌కు రెండుసార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఆయన విచారణ నిర్వహించకుండానే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కార్పొరేటర్ షేక్ బీ జాన్‌బీ మాట్లాడుతూ మేయర్‌కు నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు కరీమున్నీసా, బి.సంధ్యారాణి, టి.జమలపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.