శ్రీవారిసేవలో శ్రీలంక అధ్యక్షుడు
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం వేకువజామున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు, పోలీసుల సమన్వయ లోపం వల్ల మైత్రిపాల సిరిసేన కొద్ది సమయం నిరీక్షించాల్సి వచ్చింది.
స్వామి దర్శనం పూర్తిచేసుకొని వాహనాల వద్దకు చేరుకున్న సిరిసేన డ్రైవర్ ఆలయంలోనే ఉండిపోవడంతో కాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. మైత్రిపాల వెలుపలకు వస్తున్నారనే సమాచారం ఆలయ అధికారులు పోలీసులకు ఇవ్వకపోవడంతో కాన్వాయ్ డ్రైవర్లు లోపలే ఉండిపోయారు. దీంతో అధ్యక్షుడు డ్రైవర్ వచ్చే వరకు కారులో వేచి ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ జయలక్ష్మీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.