కార్యాలయం సరే.. సిబ్బంది ఏరీ?
- ఖాళీగా జంతుహింస నివారణ కమిటీ కార్యాలయం
అనంతపురం అగ్రికల్చర్: జంతుహింస నివారణ కమిటీ (సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్–ఎస్‌పీసీఏ) పేరుతో స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేశారు. 20 రోజుల కిందట కార్యాలయం ప్రారంభించినా అందులో పనిచేయడానికి సిబ్బందిని నియమించలేదు. ఒక ఏడీ, మరో ఇద్దరు సిబ్బందికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నా వారు పని చేస్తున్న ప్రాంతాల్లో తీరికలేని పరిస్థితి. దీంతో కార్యాలయం ఖాళీగానే దర్శనమిస్తోంది.
ఎక్కడైనా జంతువులను హింసింస్తున్నట్లు సమాచారం అందినా, కబేళాకు పశువులను తరలిస్తున్నట్లు తెలిసినా, సామర్థ్యానికి మించి వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు తెలిసినా జంతు హింస కమిటీ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేరుకొని తనిఖీ చేయాల్సి ఉంటుంది. అక్కడున్న పశువులను తీసుకెళ్లి పెనుకొండ వద్దనున్న షీఫాంలోని గోశాలకు తరలించి మేత, నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా ..ఎస్పీ, పశుసంవర్ధకశాఖ, డీఎల్‌డీఏ, ఆర్టీఏ, అటవీ, మార్కెటింగ్, పంచాయతీ, పబ్లిక్‌హెల్త్, డీఈవో, కమర్షియల్ ట్యాక్స్, ఎన్‌జీవోలకు సంబంధించి మొత్తం 19 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇటీవలే కమిటీ సమావేశమై మార్గదర్శకాలు, కార్యాచరణ గురించి చర్చించారు. వెనువెంటనే కార్యాలయం ప్రారంభించారు. కానీ అందులో సిబ్బంది, ఇతర మౌలిక వసతుల కల్పన గురించి విస్మరించారు.