ఆస్థాయిలో జరగలేదు
► మొక్కుబడిగా స్టాండింగ్ కమిటీ సమావేశాలు
► కోరం లేకపోయినా కొనసాగింపు
► ముందుగా నివేదిక ఇవ్వని వైద్య,ఆరోగ్య శాఖ
జిల్లా సమస్యల పరిష్కారానికి నిర్వహించే స్థాయీ సంఘాలను వివిధశాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. చిన్నచూపు చూస్తున్నారు. చట్టప్రకారం రెండు నెలలకోసారి జరిగే వీటిని నామమాత్రంగానే చేపడుతున్నారు. కొందరు సభ్యులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్నారే కానీ.. సమస్యలు లేవనెత్తే పరిస్థితి కానరావడంలేదు. దీంతో.. ఆయా శాఖలు కూడా ఈ సమావేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి నివేదికలు సైతం పంపించడంలేదు.
విశాఖసిటీః జెడ్పీ కార్యాలయంలో గురువారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశాలు సాదాసీదాగా సాగాయి. సమస్యలు ప్రస్తావించే కోరం సభ్యులు లేకపోయినా.. సమావేశాలు జరగడం గమనార్హం. 1,2,4,7 సంఘాల సమావేశాలు జడ్పీ ఛైర్‌పర్సన్ లాలం భవాని అధ్యక్షతన జరగ్గా.. 4,5, స్థాయీ సంఘాల సమావేశాలకు ఒక్కొక్కరే సభ్యులు హాజరయ్యారు. ఆయా ప్రభుత్వాధికారులు తమ శాఖల్లో పనితీరును వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ లాలంభవాని మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచెయ్యాలన్నారు.
మాతాశిశు మరణాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు గాలి వరలక్ష్మి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమంతో పాటు కేంద్రాల్లోని ఐదేళ్ల బాలలకు పూర్వ ప్రాథమిక విద్య అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే.. అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం వస్తుందన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జడ్పీ వైస్ ఛైర్మన్ కె.అప్పారావుతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు, వివి«ధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నివేదికలివ్వని ముఖ్యశాఖలు..
జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు పది రోజులు ముందుగానే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తాము చేపట్టిన కార్యక్రమాలు సమగ్ర నివేదిక విధిగా అందించాలి. కానీ.. స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతున్న తీరుతో.. కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖతోపాటు 108 సర్వీసుల విభాగం, ఆరోగ్యశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులతో పాటు పలువురు నివేదికలు అందించలేదు. ఏ కారణంతో వీరు నివేదికలందించలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ్ ఆదేశించారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. శాఖాపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు.