– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
పరిగి (పెనుకొండ రూరల్) : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం పైడేటి గ్రామంలో జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు తదితర ఎన్నో లాభాలు రాష్ట్రానికి ఉంటాయన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం నాలుగే రోజులు నిరసనలతో అక్కడి జనం దాన్ని సాధించుకున్నారన్నారు. 5 కోట్ల మంది జనాభా ఉన్న మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధించుకోలేమా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు, మహిళలకు సెల్‌ఫోన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించాడన్నారు. వచ్చే ఎన్నికల్లో బంగారు గాజులు చేయిస్తామని అంటాడు.. దాన్ని మీరు నమ్ముతారా అని మహిళలను ప్రశ్నించారు. అందుకు వారు ఇక జీవితంలో చంద్రబాబును నమ్మమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. హంద్రీనీవాకు తామే నీరు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే బీకే పార్థసారథి అంటున్నారని, వారి అబ్బసొత్తు పెట్టి తెచ్చారా? అని శంకరనారాయణ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం, జిల్లా బీసీ సెల్ నాయకులు రమణ, ప్రభు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు మారుతీశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
Published Tue, Jan 24 2017 11:19 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement