‘కంది’పై సర్కారులో కదలిక!
సాక్షి, హైదరాబాద్: కందిపప్పు ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులకు పప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవైపు అక్రమ వ్యాపారం, నిల్వలను కట్టడి చేస్తూ ధరలను అందుబాటులో ఉంచే మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు, దాల్ మిల్లర్లు, వ్యాపారులతో సమావేశం కానున్నారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఏటా 1.93 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరమవుతుంది.
అయితే ఇందులో అందుబాటులో ఉంటోంది కేవలం 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా అవసరాలకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏర్పడిన కొరత కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కిలో కందిపప్పు ధర రూ.180కి చేరింది. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణ చర్యలు చేపట్టిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాలను ఆదేశించింది.
తనిఖీలు విసృ్తతం చేయాలని, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. దీనిలో భాగంగానే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమావేశం ఏర్పాటు చేశారు. ధరల కట్టడి చర్యలపై వారితో సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటే సన్నబియ్యం సరఫరా, స్టేజ్-1, స్టేజ్-2 కాంట్రాక్టర్ల కమీషన్ పెంపు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.
మిల్లర్లతో మరో దఫా చర్చలు!
సామాన్య ప్రజలకు తక్కువ ధరలో కందిపప్పు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై మంత్రి మరో దఫా దాల్ మిల్లర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఓమారు వారితో చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులకు తాము తక్కువ ధరకు విక్రయించలేమని మిల్లర్లు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు స్థానిక మిల్లర్లతో చర్చలు జరిపి ధరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రైతు బజార్లలో ప్రత్యేక కంది పప్పు కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టే అంశంపై మంత్రి మిల్లర్లను ఒప్పించే అవకాశాలున్నాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం 35 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విక్రయించిందికూడా తక్కువే. ఈ దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరిన్ని కేంద్రాల ఏర్పాటు, ధర సైతం కిలో రూ.100కు మించకుండా చూసే చర్యలపై వారితో చర్చించే అవకాశం ఉంది.