♦ తక్షణమే చెల్లించాలని ఆర్థిక మంత్రికి వైద్య మంత్రి విన్నపం
♦ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందక పేద రోగుల ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఈటల, ఆర్థికశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలు, ఉద్యోగుల వైద్యానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులకు వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నాయని ఆర్థికశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారని లక్ష్మారెడ్డి వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ కింద 938 వ్యాధులకు, కేంద్ర ప్రభుత్వ పథకంలోని కొన్ని వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 70 శాతం మంది పేదలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే చికిత్సలు చేయించుకుంటున్నారు. 30 శాతం మందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వం నుంచి 4 నెలలుగా ఆరోగ్యశ్రీకి నిధులు నిలిచిపోయాయి. దీంతో చాలాచోట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. లక్షలాదిమంది ఉద్యోగుల క్యాష్‌లెస్ వైద్యమూ ఆరోగ్యశ్రీ కిందకు వచ్చినందున వారి వైద్యానికి ప్రమాద ఘంటికలు మోగనున్నాయి.
ఆరోగ్యశ్రీకి నేరుగా నిధులు!
ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులను నేరుగా విడుదల చేయడంలేదు. వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి నిధులు పంపించి అక్కడ ఆసుపత్రుల బిల్లులను పరిశీలించి ఆ తర్వాత విడుదల చేస్తున్నారు. అనంతరం సొమ్ము ఆసుపత్రులకు విడుదలవుతోంది. దీంతో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి నేరుగా నిధులు విడుదల చేయడానికి సంబంధించిన అంశం కూడా ఆర్థికశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.200 కోట్లు
Published Sat, Feb 6 2016 3:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement