బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
యాదగిరికొండ: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని బాలా లయంలో గురువారం వేద మంత్రాల నడుమ విగ్రహాలప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఉదయం 9.59 గంటలకు బంగారు కవచ మూర్తులను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి పూజలు కొనసాగించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకారం చేశారు.
స్వామి అమ్మవార్లకు తిరుమంజనస్నపనం చేసి పట్టువస్త్రాలను ధరింపజేశారు. సకల దేవతలను ఆవాహనం చేసిన కలశాలను గర్భాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ గావించారు. చినజీయర్‌స్వామి చేతుల మీదుగా హవనం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చినజీయర్ ఆధ్వర్యంలో అర్చకులు, రుత్విక్కులు, గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల అనుమతి తీసుకుని బంగారు కవచ మూర్తులను ఆలయ తిరువీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పూజలు నిర్వహించారు.
యాదాద్రి చరిత్రలో నిలుస్తుంది...
యాదాద్రి దేవస్థానం చరిత్రలో నిలిచి పోతుందని చినజీయర్ స్వామీజీ అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులకు ప్రవచనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ఆలయం నిర్మిస్తే ప్రపంచంలో నరసింహ స్వామి ఆలయం ఎక్కడా అంటే ఇదే గుర్తుకు రావాలన్నారు. భక్తులకు కొంగు బంగారంగా ఉన్న ఈ ఆలయం మున్ముందు ఎంతో మందికి ఉపాధి చూపిస్తుందన్నారు. మనకు ఎంత తోడు ఉన్నా భగవంతుడి తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత వరకు దేవాలయాల నుంచి మాత్రమే డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడమే లక్ష్యం గా ప్రభుత్వాలు పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ప్రభుత్వ డబ్బుతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించే అంశం అని పేర్కొన్నారు.
ఏడాదిలోపే పనులు పూర్తి
ఏడాదిలోపే యాదాద్రి పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యాదాద్రిని సుమారు కొన్ని వందల సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.