
హోదా రెండు రాష్ట్రాలకూ అవసరం
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
అనుమసముద్రంపేట: తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలోని శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా, నాయబ్ రసూల్ దర్గాలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం దర్గా సజ్జాదా నషీన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ దర్గాను దర్శించుకున్న తర్వాతే డిప్యూటీ సీఎం అయ్యానని తెలిపారు.
అందుకు గాను మొక్కు తీర్చుకునేందుకు దర్గాకు వచ్చానని చెప్పారు. ఏఎస్‌పేట దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రతి రోజూ వందలాది మంది ఏఎస్‌పేటలోని హజరత్ వారి దర్గాకు వచ్చి వెళ్తున్నారన్నారు. వారి కోసం ఏఎస్‌పేటలో సౌకర్యాలతో హైదరాబాద్ భవన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తెలిపారు. కసుమూరులోని మస్తాన్‌వలీ దర్గాను కూడా ఆయన సందర్శించారు.