సబ్‌స్టేషన్ నిర్మాణంపై మొదలైన ఉద్యమం
తణుకు : సజ్జాపురం శ్మశాన వాటికలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ వామపక్షాలతో పాటు, జై సమైక్యాంధ్ర పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. ‘శ్మశానంలో సబ్‌స్టేషన్’ శీర్షికతో ఈనెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయా వర్గాల నుంచి స్పందన మొదలైంది. నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీల నాయకులు రోడ్డెక్కారు. ఈ మేరకు గురువారం సజ్జాపురం శ్మశాన వాటికను పరిశీలించిన నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డెప్యూటీ తహసీల్దార్ వర్మకు వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ సజ్జాపురం శ్మశానానికి గతంలో సుమారు 2.78 ఎకరాలు స్థలాన్ని కేటాయించారన్నారు.
అయితే ప్రస్తుతం 1200 గజాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ ం చేస్తున్నారని ఆరోపించారు. తణుకు పట్టణంలో జనాభా లక్షకు పైగా ఉండగా కేవలం రెండు శ్మశాన వాటికలు మాత్రమే ఉన్నాయన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, న్యాయవాది అనుకుల రమేష్ మాట్లాడుతూ శ్మశాన వాటికకు ఉన్న స్థలమే తక్కువగా ఉంటే ఈ ప్రాంతంలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలనుకోవడం బా«ధాకరమన్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి పీవీ ప్రతాప్, గార రంగారావు, గుబ్బల గోపి, డీవీఎన్ వేణు, డి.జగన్నాథం, దానయ్య, బసవా శ్రీను, ఎం.మైఖేల్ తదితరులు పాల్గొన్నారు.