-
నవోదయలో క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
-
ఎనిమిది జిల్లాల నవోదయ విద్యార్థుల హాజరు
-
పోటీలు ప్రారంభించిన ఐటీడీఏ పీవో వెంకటరావు
సరుబుజ్జిలి (ఆమదాలవలస రూరల్): క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఐటీడీఏ పీవో జి.వెంకటరావు అన్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో జవహార్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు సిక్కోలు జిల్లా అని, అలాంటి జిల్లాలో క్లస్టర్ స్థాయిలో పోటీలు నిర్వహించడం మంచి తరుణమన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై దృష్టిసారిస్తే మంచి విజయాలు వారి సొంతం చేసుకోవచ్చునని సూచించారు. పోటీలు ప్రారంభించే ముందు క్రీడా జ్యోతిని ఆయన వెలిగించారు. కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రంగారావు, పీడీలు పాండురంగారావు, శశిరేఖ, ఉపాధ్యాయులు, వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన క్రీడలు
విద్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించే క్రీడలకు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నవోదయ విద్యార్థులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలోని యానం నుంచి విద్యార్థులు సుమారు 200 మంది క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడల్లో భాగంగా ఉదయం నవోదయ విద్యాలయం నుంచి సరుబుజ్జిలి జంక్షన్ వరకు 5కే రన్ నిర్వహించారు. అనంతరం రన్నింగ్, జంపింగ్ (లాంగ్ జంప్, హైజంప్), త్రోయింగ్ (షార్ట్‌పుట్, డిస్‌కస్, జావలిన్, హేయర్‌త్రో) వంటి పోటీలు బాలికలు, బాలురకు నిర్వహించారు.
ఆకట్టుకున్న ఎగ్జిబిషన్
క్రీడ పోటీల్లో భాగంగా విద్యాలయంలో సైన్స్, గణితం, కంప్యూటర్ వంటి సబ్జెక్టులపై ఎనిమిది జిల్లాలకు చెందిన నవోదయ విద్యార్థులు ఎగ్జిబిషన్ నిర్వహించారు. పర్యావరణం పరిరక్షించుకోవడంతో పాటు భారీ పరిశ్రమల వల్ల పెరుగుతున్న కాలుష్యంపై విద్యార్థులు ప్రదర్శనలు రూపొందించారు. వ్యవసాయ సాగు చేసే రైతులు చిన్న పొలంలో రకరకాల సాగు పద్ధతులు, దేశంలో టెర్రరిజం పెరుగుతున్న నేపథ్యంలో చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అలవాటు చేసి దేశభక్తిని పెంపొదించడం, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం పురాతన కట్టడాలు నేడు ఆనవాళ్లు కోల్పోతున్నాయని, వాటిని రక్షించుకోవడం, వాహనాలు అధిక లోడుతో నదిపై ఏర్పాటు చేసే బ్రిడ్జిలపై ప్రయాణం చేయడం వలన కలిగే నష్టాలను తదితర వాటిపై విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌ను ఐటీడీఏ పీవో పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
మొదటి రోజు విజేతల వివరాలు
బాలుర విభాగం అండర్ 19లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో యశ్వంత్ (శ్రీకాకుళం), సాయి ప్రతాప్ (శ్రీకాకుళం), బాలికల విభాగంలో అశ్విత (యానం), లక్ష్మీ (శ్రీకాకుళం) విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో 200 మీటర్ల పరుగు పందెంలో పి.పవన్ (శ్రీకాకుళం), బి.తేజ (గుంటూరు), ఎల్.జగదీష్ (యానం), బాలికల విభాగంలో ఫణిత (శ్రీకాకుళం), కేశవాణి (విజయనగరం) విజయం సాధించారు. అలాగే, 800 మీటర్ల బాలుర పరుగు పందెంలో ఎం.సాయికుమార్ (శ్రీకాకుళం), డి.తేజ (గుంటూరు), రాఘవన్ (విశాఖపట్నం) బాలికల విభాగంలో వసిత (విశాఖపట్నం), జగదీశ్వరి (శ్రీకాకుళం) గెలుపొందారు. డిస్‌కస్ క్రీడలో బాలుర విభాగంలో వరదరాజులు (శ్రీకాకుళం), శివనారాయణ (తూర్పుగోదావరి), చంద్రశేఖర్ (విశాఖపట్నం), బాలికల విభాగంలో టి.నవీన (విశాఖపట్నం), ధనలక్ష్మీ (శ్రీకాకుళం), నీలిమ (తూర్పుగోదావరి) గెలుపొందారు. హేమర్‌త్రో పోటీల్లో బాలుర విభాగంలో రవికుమార్ (శ్రీకాకుళం), సూర్య (గుంటూరు), బాలికల విభాగంలో ధనలక్ష్మి (శ్రీకాకుళం) విజేతలుగా నిలిచారు. హైజంప్ పోటీల్లో రవికుమార్ (శ్రీకాకుళం), రాఘవన్ (విశాఖపట్నం), యువరాజ్ (తూర్పుగోదావరి), లాంగ్ జంప్ బాలుర విభాగంలో వరదరాజులు (శ్రీకాకుళం), ప్రసాద్ (విశాఖపట్నం), జగదీష్ (యానం) బాలికల విభాగంలో కేశవాణి (విజయనగరం), పద్మ (విశాఖపట్నం) గెలుపొందారు.