ఆన్‌లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్!
► విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న గేమ్స్
► అత్యంత ప్రమాదకరంగా 23 రకాల ఆటలు
► పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం
► పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు
► తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులతో విద్యాశాఖ భేటీ
► పిల్లల ప్రవర్తనను పరిశీలించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచన
సాక్షి, హైదరాబాద్: బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు ఆన్‌లైన్‌లో, కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లలో ఆడే మరెన్నో గేమ్స్ విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాము ఏదైనా చేయగలమనే అత్యుత్సాహం, ఇవి ప్రమాదకర అంశాలనే విచక్షణను కోల్పోవడం వంటి లక్షణాలు నెలకొనడంతోపాటు చివరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికీ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తోపాటు గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), వైస్‌సిటీ, మారియన్, స్వార్డ్, డెడ్లీ తదితర 23 రకాల ఆటలు కూడా యుక్త వయసు పిల్లల్లో ప్రమాదకర ధోరణులకు కారణమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తో పాటు విద్యార్థుల రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై శుక్రవారం పాఠశాల విద్యాశాఖ తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో అవగాహన, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించి పాఠశాలలకు పంపించాలని విద్యా శాఖ నిర్ణయించింది.
ప్రమాదకర గేమ్స్‌ను నిషేధించాల్సిందే..
బ్లూవేల్ గేమ్‌తో పాటు అలాంటి ప్రమాదకర ఆటలను నిషేధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అది పిల్లలు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించడం, వారు వినియోగించే మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు, ఐటీ నిపుణులు సూచించారు.
జీటీఏ కూడా ప్రమాదకరమే..
బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు.. గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), జీటీఏ సాన్ ఆండ్రూస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, మారియన్, స్వార్డ్, డెడ్లీ వంటివి గేమ్స్ కూడా ప్రమాదకరమేనని నిశ్చిత్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా జీటీఏ గేమ్ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటోందని తెలిపారు. ఆ గేమ్ పిల్లలను తనకు తానే హీరో అన్న భావనలోకి తీసుకెళుతుందని... పోలీసులను వెంబడించి చంపేలా, రోడ్లపై ఇష్టానుసారంగా వెళ్లేలా ఉండే ఆ గేమ్ కారణంగా పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఈ గేమ్ ప్రభావంతో ఢిల్లీలో ఓ విద్యార్థి తనకు తాను హీరోగా భావించి.. తన తాతనే చంపేశాడని వివరించారు.
ఈ యాప్‌తో పిల్లల ఫోన్లపై నిఘా
పిల్లలను టార్గెట్ చేసి ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు, ఈ–మెయిళ్లు వంటి రకరకాల మార్గాల్లో బ్లూవేల్ గేమ్ వెబ్‌లింకును పంపుతున్నారని ఐటీ సంస్థ నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలు బ్లూవేల్ గేమ్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన గేమ్స్‌ను అడ్డుకునేందుకు తోడ్పడే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాము కూడా పిల్లల ఫోన్లను నియత్రించేందుకు, నిఘా పెట్టేందుకు తోడ్పడే మొబైల్ యాప్‌ను రూపొందించామని నిశ్చిత్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతిని«ధి రాఘవ్ చెప్పారు. తల్లిదండ్రులు తమ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుని.. తమ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, తర్వాత పిల్లల ఫోన్లలోనూ ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలని వివరించారు. అప్పటి నుంచి పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చని... వారు చూసే వెబ్‌సైట్లు, ఆడుతున్న గేమ్స్ వంటి వాటిని బ్లాక్ చేయవచ్చని చెప్పారు. తమ సేవలు వినియోగించుకునేందుకు ఏడాదికి రూ.182 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
సమస్యను అధిగమించేందుకు రెండు మార్గాలు
రాష్ట్ర ప్రభుత్వం సైబర్, డిజిటల్ సెక్యూరిటీకి ప్రాధాన్యమిస్తోందని.. అందుకు తగిన చర్యలు చేపడుతోందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. బ్లూవేల్ గేమ్ యుక్త వయసు పిల్లలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, టీచర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని.. పిల్లల ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వాటి నుంచి పిల్లలను దూరం చేయవచ్చన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిని గమనిస్తూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందించడం ఒక మార్గమని... విద్యార్థులు వినియోగించే సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పకడ్బందీగా నియంత్రించే చర్యలు రెండో మార్గమని తెలిపారు.
పిల్లల రక్షణకు ప్రాధాన్యం..
‘‘పిల్లల రక్షణకు విద్యా శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బ్లూవేల్ గేమ్‌పై ఈ అవగాహన, చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐటీ రంగ నిపుణులను కూడా ఇందులో భాగస్వాములను చేశాం..’’ – పాఠశాల విద్యా కమిషనర్ కిషన్