విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేసీఆర్
ఎల్‌బీనగర్: విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటమాడుతున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించి సుమారు 50 రోజులు కావస్తున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో ఉన్నాయని, సరైన వసతుల్లేక విద్యార్థులు అవస్థపడుతున్నారని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్, లెక్చరర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికత అని చూడకుండా విద్యార్థులందరికీ ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అమలుచేయాలని కోరారు.
కేసీఆర్ అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8వ తేదీన కలెక్టర్లకు వినతిపత్రాలు, 11న అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, 13న జిల్లా కేంద్రాలలో రౌండ్‌టేబుల్ సమావేశాలు, 18న చలో కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రమాకాంత్, శరత్, రాములు, నవీన్ పాల్గొన్నారు.