డిప్తీరియాతో మరో విద్యార్థిని మృతి
వెల్దుర్తి రూరల్: అల్లుగుండు గ్రామంలో అన్నదమ్ములైన శివరాముడు, శివయ్య అనే ఇద్దరు బాలలు డిప్తీరియా (కంఠ వాతము, కంఠసర్పి)వ్యాధితో మృతిచెంది పదిహేను రోజులు కూడా గడవకముందే చెర్లకొత్తూరు గ్రామంలో మరో విద్యార్థిని ఇదే వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళిత పరుశరాముడు, సోమేశ్వరిల రెండవ కుమార్తె అయిన మంజుల (15) తన అవ్వా,తాతల గ్రామమైన కలుగోట్లలో ఉంటూ అక్కడి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతుంది. పదిరోజుల క్రితం ఈ విద్యార్థినికి గొంతునొప్పి, వాపు రావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నయం కాకపోవడంతో బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోలేక మంగళవారం
మృతిచెందింది. డిప్తీరియా అంటువ్యాధి కావడంతో డాక్టర్ల సలహా మేరకు విద్యార్థినిని వెంటనే స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలుగోట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మంజుల మృతికి సంతాపం లె లిపి స్కూలుకు సెలవు ప్రకటించారు.